శ్రీకాకుళం జిల్లా రాజాంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అకౌంట్‌లో డబ్బులు ఉన్నా.. అవి వాడుకునే పరిస్థితి లేకపోవడంతో ఓ కరోనా బాధితురాలు రోడ్డుపైనే ప్రాణాలు విడిచింది. వివరాళ్లోకెళితే.. రాజాం మండలం పెంటఅగ్రహారం కు చెందిన అంజలి అనే ఓ మహిళకు కరోనా సోకింది. దీంతో మహిళను జీఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆస్పత్రికి బంధువులు తీసుకువచ్చారు. అయితే.. అక్కడ ఆసుపత్రి సిబ్బంది ఫోన్ పే, గూగుల్ పే లాంటి ఆన్‌లైన్ పేమెంట్‌ను నిరాకరించారు. క్యాష్ పేమెంట్ చేస్తేనే అడ్మిట్ చేసుకుంటామని తేల్చి చెప్పారు.
దీంతో చేసేదేమీ లేక డబ్బు కోసం బాధితురాలి బంధువులు ఏటీఎంల చుట్టూ 3 గంటల పాటు తిరిగారు. ఇంతలో బాధితురాలు ఊపిరాడక పరిస్థితి విషమించడంతో రోడ్డుపైనే మరణించింది. కేర్ ఆస్పత్రి సిబ్బంది వైఖరి పట్ల మృతురాలి బంధువులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిజిటలైజేషన్‌లో భాగంగా ఆన్‌లైన్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్న ఈ కాలంలో కూడా ఇంకా క్యాష్ ఉంటేనే చేర్చుకుంటామంటూ ప్రజల ప్రాణాలు తీయడం ఏంటని మండిపడుతున్నారు.