గృహ హింస కేసు.. కన్నా కోడలికి రూ.కోటి పరిహారం
Court orders to Kanna Lakshminarayana family to pay one crore to his daughter in law.భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర
By తోట వంశీ కుమార్
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలికి గృహహింస కేసులో కోటి రూపాయల పరిహారం చెల్లించాలని విజయవాడ లోని ఒకటో చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా నెలకు యాభై వేల రూపాయలను భరణంగా చెల్లించాలని, కోర్టు ఖర్చుల కింద రూ.వెయ్యిలను చెల్లించాలని బుధవారం తీర్పు నిచ్చింది. శ్రీక్ష్మీ కీర్తి పాపకు అనారోగ్యంగా ఉండడంతో వైద్యానికి ఖర్చు చేసిన రూ.50వేలు కూడా తిరిగి చెల్లించాలని ఆ తీర్పులో పేర్కొంది. మూడు నెలల్లో ఈ మొత్తాన్ని చెల్లించాలని..అలా కానీ పక్షంలో 12 శాతం వడ్డీతో చెల్లించాలని తెలిపింది.
శ్రీలక్ష్మీ కీర్తి 2006 మే 10న కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు నాగరాజును ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి 2013లో కుమారై కౌషిక మానస జన్మించింది. 2015 వరకు అందరం కలిసే ఉన్నామని.. ఆ తరువాత నుంచి తనకు వేదింపులు మొదలయ్యాయని అత్త విజయలక్ష్మి తనను సూటిపోటి మాటలతో వేధించేవారని శ్రీలక్ష్మి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు చూడడానికి వచ్చినా ఇంటిలోనికి రానివ్వ లేదని తెలిపింది. తనను కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకుంటే కోట్ల రూపాయల ఆస్తులు వచ్చి ఉండేవంటూ వేధించేవారని, తన భర్త కూడా మరో మహిళతో సంబంధం పెట్టుకుని తనను వేధించారని ఆరోపించింది. దీనిపై ప్రశ్నించినందుకు 29 మార్చి 2015న తనపై దాడి చేశారని.. అప్పటి నుంచి తనను దూరం పెట్టారని బాధితురాలైన శ్రీలక్ష్మీ కీర్తి తన ఫిర్యాదులో పేర్కొంది. తనకు, తన కుమార్తెకు రక్షణ కల్పించడమే కాకుండా నివాస వసతి కల్పించాలని, వైద్య ఖర్చులు ఇప్పించాలని కోరుతూ భర్త నాగరాజు, మామ కన్నా లక్ష్మీనారాయణ, అత్త విజయలక్ష్మిలపై కోర్టులో కేసు వేశారు.