అమరావతి: ఆస్తి పన్ను బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రాయితీ గడువు నేటితో ముగియనుంది. ఈ నెల 25న 50 శాతం రాయితీ ప్రకటించగా, శనివారం ఒక్క రోజే రూ.60 కోట్లు వచ్చాయి. మొత్తంగా పట్టణ, స్థానిక సంస్థల్లో గత ఐదు రోజుల్లో రూ.204 కోట్లు వసూలు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఇది నగదు కొరతతో బాధపడుతున్న మున్సిపల్ సంస్థలకు పెద్ద ఊరటనిస్తోంది. 26వ తేదీన రూ.32 కోట్లు, 27వ తేదీన రూ.40 కోట్లు, 28వ తేదీన రూ.38 కోట్లు, 29వ తేదీన రూ.60 కోట్లు, 30వ తేదీన రూ.34 కోట్లు వసూలు అయ్యాయి.
రంజాన్ కారణంగా ఇవాళ సెలవు అయినా పన్ను వసూళ్లకు వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అధికారులు అందుబాటులో ఉంటారు. నిన్న ఉగాది పండుగ కావడంతో ఎక్కువ మంది పన్ను చెల్లింపులు చేయలేకపోయారు. అయితే ఇవాళ ప్రజలు భారీగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. కాగా ఆస్తి పన్నుపై 50 శాతం వడ్డీ మాఫీపై మున్సిపల్ అధికారులు భారీ అవగాహన కార్యక్రమాలను చేపట్టారు.