వరద ప్రాంతాల్లో బాధితుల పరామర్శలో భాగంగా సీఎం జగన్ రెండో రోజు పర్యటన సాగుతోంది. అల్లూరి సీతరామరాజు జిల్లాలో సీఎం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చింతూరు మండలం కుయుగూరు, చట్టి గ్రామాల్లోని వరద బాధితులను పరామర్శించి, వరద సాయం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం.. వరదలతో నష్టపోయిన ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని, ప్రతీ ఒక్కరికీ పరిహారం అంది తీరుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు.
సీఎం జగన్ మాట్లాడుతూ.. పారదర్శకంగా బాధితులకు పరిహారం అందించామని తెలిపారు. అందరికీ రేషన్, ఇంటింటికీ రూ.2 వేలు అందించామన్నారు. అధికారులను భాగస్వామ్యం చేసి, కావాల్సిన వనరులు సమకూర్చామని చెప్పారు. పోలవరం నిర్వాసితుల పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వంతో కుస్తీ పడుతూనే ఉన్నామని చెప్పారు. కేంద్రం పరిహారం ఇవ్వకపోతే.. రాష్ట్రం తరఫున సెప్టెంబర్‌లోగా నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తామని తెలిపారు.
''4 ముంపు మండలాలతో రెవిన్యూ డివిజన్ ఏర్పాటు ఉంటుంది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి రూ.20 వేల కోట్లు అవసరం. ఆ ప్యాకేజీ కోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నాం. రూ. వెయ్యి కోట్లు, రూ. 2వేల కోట్ల అయితే మేమే ఇచ్చేవాళ్లం. అంత పెద్ద మొత్తం కాబట్టే కేంద్రాన్ని అడుగుతున్నాం. పోలవరం నిర్వాసితులకు పునరావసం కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదే. నిర్వాసితులకు పూర్తి పరిహారం ఇచ్చాకే పోలవరం ప్రాజెక్టు నింపుతాం. ఏ ఒక్కరికీ అన్యాయం జరగనీయం. కేంద్రం నుంచి రావాల్సిన సాయం కోసం పోరాడాల్సి వస్తోంది. స్వయంగా మూడుసార్లు ప్రధానిని కలిసి మాట్లాడా.'' అని సీఎం జగన్ పేర్కొన్నారు.