ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుస జిల్లా పర్యటనల చేస్తున్నారు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన సీఎం.. రేపు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా.. శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద సర్వే పూర్తయిన గ్రామాల రైతులకు భూమి హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. షెడ్యూల్‌లో భాగంగా ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి సీఎం జగన్ చేరుకుంటారు.
ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.55 గంటల వరకు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం లబ్ధిదారులకు పత్రాల పంపిణీ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని సీఎంవో అధికారులు వెల్లడించారు. అయితే సీఎం బహిరంగ సభకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 1,400 గ్రామాల్లో సర్వే చేపట్టగా.. 400 గ్రామాలకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అనంతరం దశలవారీగా పట్టణ ప్రాంతాల్లో అధికారులు సర్వే చేపట్టనున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను మంత్రి ధర్మాన ప్రసాదరావు పర్యవేక్షణ చేస్తున్నారు. భూరక్ష, భూ హక్కు కార్యక్రమం లబ్దిదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని మంత్రి ధర్మాన తెలిపారు. రీ సర్వే వల్ల పేద ప్రజల ఆస్తికి రక్షణ లభిస్తుందన్నారు.