అమరావతి: రాష్ట్రానికి అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రపంచం మెచ్చే విధంగా రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేశామన్నారు. చెడు ఆలోచనలతో నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో చూశామని, పద్ధతి లేని రాజకీయాలు ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని నగరిలో నిర్వహించిన ప్రజా వేదికలో పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా నగరిలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్రలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేసిన ఏకైక కూటమి ఎన్డీయే అని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. దీపం -2 కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. ఐదేళ్లలో ప్రపంచంలోనే మన రాష్ట్రం.. స్వచ్ఛాంధ్రలో ప్రథమంగా ఉండేలా చేస్తామన్నారు. ఏడాది నుంచి ఒక ఉద్యమంగా స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర తీసుకొచ్చామన్నారు. మార్చిలోపు కోటి 12 లక్షల టన్నుల చెత్తను పూర్తిగా తొలగిస్తామన్నారు.