పెన్షన్లు పెంచుకుంటూ పోతానన్న మాట నిలబెట్టుకున్నా: సీఎం జగన్
CM Jagan's key comments on the distribution of pensions. రాజమహేంద్రవరంలో జరిగిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక సభలో సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు
By అంజి Published on 3 Jan 2023 5:14 PM ISTరాజమహేంద్రవరంలో జరిగిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక సభలో సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెన్షన్లు తీసేస్తున్నామన్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దన్నారు. తమ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి కోటాలు, కత్తిరింపులు లేవన్నారు. జనవరి నుంచి సామాజిక పెన్షన్‌ను రూ.250కు పెంచారు. ఈ నేపథ్యంలోనే రాజమహేంద్రవరంలో సభ నిర్వహించారు. కులమతాలు, పార్టీలకు అతితంగా పెన్షన్లు అందిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. చంద్రబాబు డ్రోన్ షాట్ల కోసం పేదలను బలితీసుకుంటున్నారని సీఎం జగన్ విమర్శించారు.
చంద్రబాబే హత్య చేసి మళ్లీ మనవతావాదిలాగా సాయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. పొరపాటు జరిగితే పేదవాడు నాశనమైపోతడన్నారు. పెన్షన్లు పెంచుకుంటూ పోతామన్న హామీని నిలబెట్టుకున్నానని సీఎం జగన్ తెలిపారు. వృద్ధులతో పాటు రకరకాల సమస్యలతో బాధపడుతున్న అర్హులైన వారందరికీ పెన్షన్లు అందుతున్నాయన్నారు. ప్రభుత్వం తరఫున పేదలకు అందిస్తున్న పెన్షన్ సాయం దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో లేదన్నారు. కొత్తగా మరికొందరిని పెన్షనర్ల లిస్టులో చేర్చామని, అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.
''పెన్షన్లు రూ. 2,500 నుంచి రూ.2,750కి పెంచాం. ఖర్చుకు వెనకాడకుండా లబ్ధిదారుల సంక్షేమం కోసం ప్రయత్నిస్తున్నాం. గత ప్రభుత్వంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ అందేది.. మేం అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్య పెరిగింది. ఇప్పుడు ఏకంగా 64 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో పెన్షన్ల కోసం చేసిన ఖర్చు కేవలం రూ.400 కోట్లు. ఈ ప్రభుత్వంలో పెన్షన్లకే రూ.1,765 కోట్లు ఇస్తున్నాం. దేశంలో రూ.2,750 నుంచి పదివేల రూపాయల దాకా పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే'' అని సీఎం జగన్ అన్నారు.