అర్చకులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. కనీస వేతనం భారీగా పెంపు
దసర పండుగ సందర్భంగా అర్చకులకు సీఎం వైఎస్ జగన్ గుడ్‌న్యూస్ చెప్పారు. అర్చకులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నెరవేర్చారు.
By అంజి Published on 20 Oct 2023 6:50 AM ISTఅర్చకులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. కనీస వేతనం భారీగా పెంపు
దసర పండుగ సందర్భంగా అర్చకులకు సీఎం వైఎస్ జగన్ గుడ్‌న్యూస్ చెప్పారు. అర్చకులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నెరవేర్చారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 1,177 మంది అర్చకులకు కనీస వేతనం పెంచారు. ఈ మేరకు కనీస వేతనం రూ.15,625 పెంచుతూ దేవాదాయ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. 14-05-2021న జీవో నంబర్ 52 జారీ చేయగా.. అందుకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై అంధ్రప్రదేశ్‌లోని అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ సంక్షేమ ఛైర్మన్‌గా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన పేరి కామేశ్వరరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జి అనంతరాము ఉత్తర్వులు జారీ చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌తో పాటు రాష్ట్రంలోని బ్రాహ్మణుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కామేశ్వరరావు అన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు ఇవాళ సీఎం వైఎస్ జగన్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. పట్టు వస్త్రాలతోపాటు పసుపు, కుంకుమలను ప్రభుత్వం తరపున అందించనున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కనకదుర్గ అమ్మవారి జన్మనక్షత్రమైన మూల.. శుక్రవారం కలిసి రావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులను అనుగ్రహించనున్నారు.