ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బుధవారం వేర్వేరుగా లేఖలు రాశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని.. తక్షణ సాయం కింద రూ.1000కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని ఆ లేఖలో సీఎం కోరారు. చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాలో అసాధారణ రీతిలో వర్షపాతం నమోదు అయ్యిందన్నారు. చాలా ప్రాంతాల్లో 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షం కురిసినట్లు తెలిపారు.
తిరుపతి, తిరుమల, నెల్లూరు, మదనపల్లె, రాజంపేట లు భారీ వర్షాలు కారణంగా నీట మునిగాయన్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. 196 మండలాలు నీటమునిగాయని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో 324 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆ నాలుగు జిల్లాలోని రహదారులు, చెరువులు, కాల్వలు కోతకు గురైయ్యాయని తెలిపారు. చెరువులకు గండ్లు పడడంతో చాలా ప్రాంతాలు నీటమునిగాయని.. తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయాలని ఆ లేఖల్లో సీఎం జగన్ కోరారు.