జలవివాదంపై ప్రధానికి సీఎం జగన్ లేఖ
CM Jagan writes Letter to PM Modi.తెలుగు రాష్ట్రాల మధ్య రాజుకున్న జల జగడంపై ప్రధాని నరేంద్ర మోదీ,
By తోట వంశీ కుమార్ Published on 2 July 2021 5:06 AM GMTతెలుగు రాష్ట్రాల మధ్య రాజుకున్న జల జగడంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలిస్తోందని అందులో ఫిర్యాదు చేశారు. 'జలవిద్యుత్తు ఉత్పాదన కోసం అక్రమంగా నీటిని వినియోగించుకోకుండా తెలంగాణ రాష్ట్రాన్ని నిలువరించండి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతి లేకుండా వారు నీటిని వాడుకోకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ అక్రమంగా వినియోగించుకుంటున్న నీటిని వారి వాటా 299 టీఎంసీల నుంచి మినహాయించాలి. కేంద్రం వెంటనే కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసి నోటిపై చేయాలి. ఉమ్మడి జలాశయాల్లో నీటిని మళ్లించే చోట కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలను మోహరించి ఏపీ ప్రయోజనాలను కాపాడాలి' అని ప్రధానికి, జల్‌శక్తి మంత్రికి గురువారం రాత్రి సీఎం జగన్ లేఖ రాశారు.
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన నిలిపివేయాలని ఆదేశించినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోట్లేదన్నారు. జూన్ నెలలో 23, 24 తేదీల్లో రెండు లేఖలు రాశామని, నాగార్జున సాగర్‌లో కూడా తక్కువ నీటి మట్టం ఉన్నా జలవిద్యుత్ ఉత్పాదనకు ప్రయత్నిస్తున్నారని లేఖలో జగన్ ఆరోపించారు. విద్యుత్ ఉత్పత్తికి నీటిని విడుదల చేయొద్దన్న ఆదేశాలున్నా.. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ నీటిని విడుదల చేస్తోందన్నారు. ఈ చర్యలు అంతర్రాష్ట్ర సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయని, కింది ప్రాంతాల హక్కులను కాలరాసేలా తెలంగాణ చర్యలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణ చర్యల వల్ల రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల తాగునీరుకు సమస్యలు తలెత్తుతాయని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 834 ఫీట్ల వరకు నీళ్లు ఉంటేనే విద్యుదుత్పత్తికి నీళ్లు వాడుకోవాలని, ప్రస్తుతం శ్రీశైలంలో కేవలం 808 ఫీట్ల వరకు మాత్రమే నీళ్లున్నాయని, 33 టీఎంసీలు తక్కువగా ఉన్నా కూగా తెలంగాణ నీళ్లు వాడేస్తోందన్నారు.