ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆదివారం ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. తిరువూరు సభలో జగనన్న విద్యా దీవెన పథకం నాలుగో విడత కింద రూ. 700 కోట్ల నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి వేయనున్నారు. మొత్తం 11 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి బటన్ నొక్కి డబ్బులు జమ చేయనున్నారు. ప్రతీ ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతో సీఎం పనిచేస్తున్నారని, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారని వైసీపీ నేతలు చెబుతున్నారని.. ఈ మూడేళ్లలో 31.4 లక్షల మందికి జగనన్న విద్యాదీవెనను చేరువ చేశారని అన్నారు.
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చారని, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ కాలేజీలను తీర్చిదిద్దారని చెప్పారు. ప్రభుత్వ విద్యను చంద్రబాబు నిర్వీర్యం చేశారని, చదువు ద్వారానే అన్నీ సాధ్యమనే విషయాన్ని నమ్మిన వ్యక్తి జగన్ అని చెప్పారు. అందుకే విద్యకు జగన్ పెద్ద పీట వేశారని తెలిపారు.