నేటి నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన
CM Jagan will visit Kadapa district for three days from today.సీఎం జగన్ మూడు రోజుల పాటు సొంత జిల్లా కడపలో
By తోట వంశీ కుమార్ Published on 23 Dec 2022 3:34 AM GMTసీఎం జగన్ మూడు రోజుల పాటు సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. నేటి నుంచి ఆదివారం వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుడతారు. ప్రైవేటు కార్యక్రమాలకు సీఎం హాజరుకానున్నారు. పులివెందుల, ఇడుపులపాయలలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.
సీఎం పర్యటన షెడ్యూల్ ఇదే..
- నేడు(శుక్రవారం) ఉదయం 10.15 గంటలకు సీఎం జగన్ తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతారు. 11.30 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కడపలోని అమీన్ పీర్ దర్గాకు వెలుతారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ ఖాన్ ల కుటుంబాల్లో జరిగే వివాహ వేడుకలకు హాజరవుతారు. మధ్యాహ్నం 2.15 గంటలకు కమలాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అక్కడ రూ. 902 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు.కమలాపురం సభ తర్వాత హెలిప్యాడ్‌కు చేరుకుని స్థానిక నేతలతో అరగంట సేపు సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ గెస్ట్ హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు.
- శనివారం ఉదయం వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి 12.40 గంటలకు పులివెందులలోని భాకరాపురంలో గల హెలిప్యాడ్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారు. పలు ప్రాంతాల్లో ప్రజలనుద్దేశించి జగన్ ప్రసంగిస్తారు. 5.00 గంటలకు భాకరాపురం హెలిప్యాడ్ చేరుకొని 5.40 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ గెస్ట్ హౌస్‌కు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.
- ఆదివారం క్రిస్మస్ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం తర్వాత తాడేపల్లి నివాసానికి తిరిగి రానున్నారు.