రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ.. నేడు ప్రారంభించనున్న సీఎం
ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
By అంజి Published on 18 Dec 2023 8:31 AM ISTరూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ.. నేడు ప్రారంభించనున్న సీఎం
ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. నేటి నుంచి కొత్త ఫీచర్లతో కూడిన ఆరోగ్యశ్రీ స్ట్మార్ట్ కార్డులు లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఈ కొత్త ఆరోగ్య శ్రీ కార్డులో క్యూఆర్ కోడ్, లబ్ధిదారుని ఫోటో, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుని ఆరోగ్య వివరాలతో ABHA ఐడీ ఉంటుంది. 4.52 కోట్ల మంది లబ్ధిదారులకు ఆరోగ్య శ్రీ సేవలు, ఆరోగ్య శ్రీ యాప్ పై విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. ప్రతి ఇంట్లో ఒకరి ఫోన్‌లో ఆరోగ్యశ్రీ యాప్ ఉండేలా.. ఉచిత వైద్యం ఎలా చేయించుకోవాలి? ఎక్కడికి వెళ్లాలి? సేవలు ఎలా పొందాలి? అనే వివరాలపై వలంటీర్లతో అవగాహన కల్పించనున్నారు.
ఇప్పటికే క్యాన్సర్ వంటి వ్యాధులకు పూర్తిగా ఉచితంగా వైద్యం అందిస్తున్న జగన్ ప్రభుత్వం.. నేటి నుంచి కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలను మెరుగుపరిచిందని, దీని కింద డిసెంబర్ 18 నుండి రాష్ట్రవ్యాప్తంగా రూ. 25 లక్షల వరకు చికిత్స అందించబడుతుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డుదారులందరికీ వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుందని ప్రజల్లో విశ్వాసం నింపాలని వైద్యఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఆరోగ్యం, విద్య ప్రయోజనాలను ప్రజలకు అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి అన్నారు.