ఏపీ రైతులకు శుభవార్త.. నేడు వారి ఖాతాల్లో నగదు జమ
CM Jagan will release YSR Rythu Bharosa PM Kisan Samman scheme money to accounts today.రైతులకు శుభవార్త.
By తోట వంశీ కుమార్ Published on 17 Oct 2022 7:55 AM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్న ముఖ్యమంత్రి జగన్ క్రమం తప్పకుండా రైతు భరోసా నగదును ఎప్పటికప్పుడు అకౌంట్లలో వేస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా నాలుగో ఏడాది రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం రెండో విడత నిధులను నేడు విడుదల చేయనున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సభలో పాల్గొనున్న సీఎం.. ఆ కార్యక్రమంలో ఒక్కొక్కరికి రూ.4వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 50.92లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,096.04కోట్ల రైతు భరోసా సాయాన్ని బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
రైతు భరోసా ద్వారా సంవత్సరానికి అన్నదాతల ఖాతాల్లో మూడు విడతల్లో రూ.13,500 సాయంగా ప్రభుత్వం అందిస్తోంది. మొదటి విడతగా ఖరీఫ్ పంటలు వేసే ముందు మే నెలలో రూ.7,500, రెండవ విడతగా అక్టోబర్‌లో పంట కోతలు, రబీ అవసరాల కోసం రూ.4,000, మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ జనవరిలో రూ.2,000 అందిస్తోంది. నేడు అందించే రూ.2,096.04 కోట్లతో కలిపితే ఇప్పటివరకు ఒక్క వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రైతన్నలకు రూ.25,971.33 కోట్ల మేర లబ్ధి చేకూరింది.
సోమవారం సీఎం జగన్ ఆళ్లగడ్డలోని వైపీపీఎం ప్రభుత్వ జూనియకర్ కాలేజీ మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో ఆళ్లగడ్డలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి.. విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి ఉదయం 10.15 గంటలకు ఆళ్లగడ్డకు చేరుకుంటారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జేఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరుకానున్నారు.