స్వయం ఉపాధితో జీవిస్తున్న చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, చేతివృత్తుల వారికి జగనన్న తోడు పథకం నిధులను సీఎం జగన్ ఇవాళ విడుదల చేయనున్నారు. వరుసగా 8వ విడత జగనన్న తోడు పథకం అమలులో భాగంగా 3.95 లక్షల మంది ఖాతాల్లో రూ.417 కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు జమ చేయనున్నారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించనుంది. ఇందులో కొత్త లబ్ధిదారులకు రూ.10 వేలు, పాతవారికి రూ.11 వేలు, రూ.12 వేలు, రూ.13 వేల చొప్పున అందిస్తారు. అలాగే మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో 5.81 లక్షల మందికి రూ.13.64 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను జమ చేస్తారు.
ఈ రెండూ కలిపి మొత్తం రూ.431.58 కోట్లను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో జమ చేయనున్నారు. జగనన్న తోడు పథకం కింద నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి సీఎం జగన్ ఆర్థిక చేయూతనిస్తున్నారు. ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేల రుణం సున్నా వడ్డీకే అందిస్తున్నారు. రుణాలను సకాలంలో చెల్లించినవారికి ఏడాదికి మరో రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకు వడ్డీలేని రుణం అందిస్తున్నారు. ఇలా ఇప్పటికి ఏడు విడతలు రుణాలు, వడ్డీని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. 8వ విడత ఇవాళ విడుదల కానుంది.