నాకు అండగా ఉన్నది ప్రజలే: సీఎం జగన్
CM Jagan who participated in YCP plenary and spoke. ప్రతిపక్షంపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ప్రతిపక్షానికి నైతిక విలువలు ఉన్నాయా అని ప్రశ్నించారు.
By అంజి Published on 8 July 2022 4:01 PM ISTప్రతిపక్షంపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ప్రతిపక్షానికి నైతిక విలువలు ఉన్నాయా అని ప్రశ్నించారు. కులాల కుంపట్లు, మతాల మంటలు రేపుతున్నారని మండిపడ్డారు. తనకు అండగా ఉన్నది ప్రజల తోడు ఒక్కటేనని సీఎం జగన్ అన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఇవాళ, రేపు వైసీపీ నిర్వహిస్తున్న ప్లీనరీలో సీఎం జగన్ మాట్లాడారు. తాము ప్రజల గుండెల్లో ఉన్నామని, ప్రతిపక్షానిది చేతగాని పాలన అని, తమది చేతల పాలన అని చెప్పారు. తమ గెలుపును ఆపడం ఎవరి తరం కాదన్నారు. అధికారం అంటే అహంకారం కాదని, ప్రజలపై మమకారం అని నిరూపించామని సీఎం పేర్కొన్నారు.
2009 సెప్టెంబర్ 25న పావురాల గుట్టలో మొదలైన సంఘర్షణ ఓదార్పు యాత్రతో పార్టీ ఒక రూపం దాల్చిందని సీఎం జగన్ అన్నారు. వైఎస్సార్ ఆశయాల సాధన కోసం పార్టీ ఆవిర్భవించిందని, కోట్లాది మంది అభిమానులకు, ప్రజలకు సెల్యూట్ అని సీఎం అన్నారు. ఈ 13 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని చెప్పారు. ఈ ప్రయాణంలో ఎన్నో కుట్రలు, దాడులు, దుష్ప్రచారాలు చేసినా.. గుండె బెదరలేదు, సంకల్పం మారలేదన్నారు. ఈ జగమంత కుటుంబం ఏనాడూ తన చేయి వీడలేదని, తోడుగా నిలబడ్డారని చెప్పారు. అందుకే 2019లో భారీ మెజార్టీతో వైసీపీ హిస్టరీ క్రియేట్ చేసిందన్నారు.
దేవుడు, ప్రజల ఆశీస్సులతో 175 స్థానాలకు గాను 151 మంది ఎమ్మెల్యేలను గెలిచి అధికారం చేపట్టామన్నారు. అధికారంలోకి వచ్చాక పేదలు, సామాన్యులు, అన్ని ప్రాంతాల వర్గాల కోసమే బతికామని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ప్రతిక్షణం తపించామన్నారు. మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. మేనిఫెస్టోలని 95 శాతం హామీలను అమలు చేసి గడపగడపకు వెళ్లి ప్రతి వ్యక్తికి కలుస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం నిబద్ధతో కూడిన పరిపాలన చేస్తోందని చెప్పారు.