48 గంటలోపు వరద బాధితులకు సాయం అందించాలి: సీఎం జగన్
CM Jagan video conference flood situation Andhrapradesh. ఏపీలో వరదలపై సీఎం వైఎస్ జగన్.. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో వరద ప్రభావిత
By అంజి
ఏపీలో వరదలపై సీఎం వైఎస్ జగన్.. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం సమీక్షించారు. వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతోందని, సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ బాధ్యత అంతా సీనియర్ అధికారులు, కలెక్టర్ల భుజాల మీద ఉందన్నారు. వచ్చే 48 గంటల్లో ఏ ఇల్లు కూడా మిగిలిపోకుండా రూ.2 వేల రూపాయల సహాయం అందాలన్నారు. వరద బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో బంగాళాదుంపలు, కిలో ఉల్లిపాయలు, కిలో పామాయిల్ అందాలని, ప్రతీ గ్రామంలో పంపిణీ ముమ్మరం చేయాలని, కలెక్టర్లు దీన్ని సవాల్‌గా తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.
నాణ్యమైన సేవలు అందాలి
''గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అందుబాటులో ఉంది. ప్రతీ సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రతీ 50 ఇళ్లకూ ఒక వాలంటీర్ ఉన్నారు. ఇలాంటి వ్యవస్థకు ఇప్పుడు మీకు అందుబాటులో ఉంది. కాబట్టి నాణ్యమైన సేవలు అందించాలి. సరుకుల పంపిణీని ముమ్మరం చేయాలి.'' అని సీఎం జగన్ అధికారులను ఆదేశాలు జారీ చేశారు.
తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు..
గతంలో ఎప్పుడూ లేని విధంగా సహాయక కార్యక్రమాలు చేస్తున్నామని, రూ.2 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ వంటి వారు అభివృద్ధి పనులపై బురదజల్లుతున్నారని, రాష్ట్రం ప్రతిష్ఠ, అధికారుల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని సీఎం జగన్ పేర్కొన్నారు.
వరద తగ్గగానే పంట నష్టంపై అంచనాలు
వరద తగ్గుముఖం పట్టిన వెంటనే 10 రోజుల్లో పంట, ఆస్తి నష్టాలపై అంచనాలు పూర్తిచేయాలని సీఎం జగన్ సూచించారు. గర్భవతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారిని ఆస్పత్రులకు తరలించాలని చెప్పారు. ''వరదల కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయి. అలాంటివి లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది, మందులు ఉండేలా చూసుకోవాలి. రక్షిత తాగునీటి సరఫరాను అవసరమైన ప్రాంతాలకు కొనసాగించండి.'' అని అధికారులకు సీఎం జగన్ సూచించారు.