ఏపీలో రేషన్ సరుకుల డోర్ డెలివరీకి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?
CM Jagan to start Ration Door Delivery from February 1st.ఏపీలో రేషన్ సరుకుల డోర్ డెలివరీకి ముహూర్తం ఖరారు.
By తోట వంశీ కుమార్ Published on 5 Jan 2021 4:01 AM GMTఏపీ ప్రభుత్వం మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. ఫిబ్రవరి 1 నుంచి ఇంటికే రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌మెహన్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ, రేషన్ డోర్ డెలివరీపై సీఎం తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పౌర సరఫరాల కమిషనర్ కోన శశిధర్‌తో పాటు, పలు శాఖలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ధాన్యాన్ని సేకరించిన 15 రోజుల్లో చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకూ సేకరించిన ధాన్యానికి సంక్రాంతి నాటికి రైతుల బకాయిల్ని చెల్లించాలన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించిన బిల్లులు పెండింగులో పెట్టకూడదని..ఖరీఫ్ నాటికి నిర్ణీత లక్ష్యం ప్రకారం ధాన్యం సేకరణ జరగాలని సూచించారు. ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీ కోసం సిద్దమైన ప్రత్యేక వాహాలను ఈ నెల 3వ వారంలో ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. అదే రోజు 10 కిలోల రైస్ బ్యాగ్స్‌ను ఆవిష్కరించనున్నారు. దీని కోసం 9,260 మొబైల్ యూనిట్లు ఏర్పాటు మోడర్న్ వేయింగ్ మిషన్స్ సిద్ధం చేశారు. పంపిణీ కోసం 2.19 కోట్ల నాన్ ఓవెన్ క్యారీ బ్యాగులు సిద్ధం చేశారు.
ఈప్రత్యేక వాహనాల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలకు కేటాయించనున్నారు. ఇందులో 2 వేల 333 వాహనాల్ని ఎస్సీలకు, 7 వందల వాహనాల్ని ఎస్టీలకు, 3 వేల 875 వాహనాల్ని బీసీలకు, 1616 వాహనాల్ని ఈబీసీలకు, 567 వాహనాల్ని ముస్లింలకు, 85 వాహనాల్ని క్రైస్తవ మైనార్టీలకు కేటాయించనున్నారు. వాహన లబ్దిదారులకు 30 శాతం సబ్సిడీ, 60 శాతం బ్యాంకు రుణం లభించనుండగా..పది శాతం లబ్దిదారుడి వాటా అని ప్రభుత్వం పేర్కొంది.