ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పథకాలకు అర్హత ఉండి పేమెంట్ ఫెయిల్ అయిన వారికి, గ్రీవెన్స్ క్లియర్ అయి కొత్తగా అర్హత పొందిన వారికి ఇవాళ ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. సంక్షేమ పథకాలకు అర్హులై ఉండి ఏదైనా కారణంతో లబ్ధిపొందని వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే. అలా లబ్ధిపొందని 68,990 మంది ఖాతాల్లో రూ.97.76 కోట్లను సీఎం జగన్ ఇవాళ బటన్ నొక్కి డబ్బులు జమ చేయనున్నారు.
జనవరి - జూన్ మధ్య అమలైన పథకాలకు సంబంధించి జూన్ - జులైలో, జూలై - డిసెంబర్ మధ్య అమలైన పథకాలకు సంబంధించి డిసెంబర్ - జనవరిలో సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. అధికారులు అర్హతల విషయంలో కొన్ని కారణాలు చూపి పక్కన పెట్టిన వారిని గుర్తించి వారికి మళ్లీ నిధులను విడుదల చేయనున్నారు. ఆగస్టు 2023 నుంచి డిసెంబర్ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ధిపొందని 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను ఇవాళ సీఎం వైఎస్ జగన్.. సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.