'దిశ' యాప్ ఉంటే అన్న తోడుగా ఉన్నట్లే.. డౌన్‌లోడ్ ఇలా
CM Jagan steps promote Disha app.యువతులు, మహిళల భద్రత కోసం దిశ మొబైల్ యాప్‌ను తీసుకొచ్చామని..
By తోట వంశీ కుమార్ Published on 29 Jun 2021 1:02 PM ISTయువతులు, మహిళల భద్రత కోసం దిశ మొబైల్ యాప్‌ను తీసుకొచ్చామని.. దిశ యాప్‌పై ఇంటి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విజయవాడ శివారు గొల్లపూడిలో మహిళా పోలీసులు, వాలంటీర్లతో దిశ యాప్‌పై నిర్వహించిన అవగాహాన సదస్సులో సీఎం మాట్లాడారు. ఇటీవల ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగిన ఘటన తన మనసును కలిచి వేసిందన్నారు. దిశ యాప్‌కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లు అని చెప్పారు. దిశ యాప్‌ను ఎంత ఎక్కువగా డౌన్‌లోడ్ చేయించగలిగితే అంతగా అక్క చెల్లెమ్మలకు అది తోడుగా నిలుస్తుందన్నారు.
యువతులు, మహిళల భద్రత కోసం దిశ యాప్ రూపొందించామని, ఇప్పటికే దిశ యాప్ నాలుగు అవార్డులు సొంతం చేసుకుందని గుర్తుచేశారు. ఇప్పటికే 17 లక్షల మంది దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారని, స్మార్ట్ ఫోన్ ఉండే ప్రతి మహిళ వద్ద దిశ యాప్ ఉండాలని సీఎం జగన్ చెప్పారు. రాష్ట్రంలో కనీసం కోటి మంది మహిళల మొబైళ్లలో దిశ యాప్ ఉండేలా చర్యలు చేపడుతన్నామని జగన్ చెప్పారు. ఫోన్‌లో దిశ యాప్ ఉంటే ఒక అన్న తోడుగా ఉన్నట్టే, ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ అని తెలిపారు.
అనుకోని ఘటన ఎదురైనప్పుడు యాప్‌లోని ఎస్‌వోఎస్ బటన్ నొక్కితే నిమిషాల్లో పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుంటారని.. యాప్ ద్వారా బాధితులు ఉన్న లొకేషన్ వివరాలు నేరుగా కంట్రోల్ రూం, పోలీస్ స్టేషన్‌కు చేరేలా పటిష్టమైన కార్యాచరణ రూపొందించామన్నారు. ఇప్పటికే పోలీస్ గస్తీ వాహనాలను పెంచామని మరిన్ని పెంచుతామని చెప్పారు. రాష్ట్రంలో 18 దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేసి, దిశ చట్టం కూడా చేశామన్నారు. దిశ కేసుల కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం చేపట్టామని, దిశ కేసుల విచారణ కోసం త్వరలోనే ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు.
డౌన్‌లోడ్ ఇలా..
- ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో ప్లే స్టోర్, ఆప్ స్టోర్ నుంచి దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి
- యాప్ డౌన్‌లోడ్ పూర్తైన తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ నంబర్ వస్తుంది
- ఓటీపీ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత.. పేరు, మొబైల్ నంబర్, అడ్రస్, ప్రత్యామ్నాయ నంబరు, అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన కాంటాక్ట్ నంబర్లు తదితర వివరాలు నమోదు చేయాలి. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
- అక్కాచెల్లెమ్మలు ఆపదలో ఉన్నామని భావించిన వెంటనే దిశ యాప్‌లో ఉన్న అత్యవసర సహాయం (SOS) బటన్ నొక్కితే వారి ఫోన్ నంబరు, చిరునామా, వారున్న లోకేషన్‌తో సహా వారి వాయిస్‌తో పాటు 10 సెకన్ల వీడియో రికార్డ్ చేసి దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌కి పంపేలా దిశ యాప్‌కి రూపకల్పన చేశారు.
- అక్కాచెల్లెమ్మల నుంచి అలెర్ట్ రాగానే కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తమై సమీప పోలీస్ స్టేషన్‌కి సమాచారం చేరవేస్తారు. పోలీసులు తక్షణం అక్కడికి చేరుకుని వారికి రక్షణ కల్పిస్తారు.