అధికారం దక్కలేదనే అక్కసుతోనే చిచ్చు : సీఎం జగన్
CM Jagan speech police martyrs remembrance day.అధికారం దక్కలేదనే అక్కసుతోనే చీకట్లో రథాలను తగులబెట్టారని
By తోట వంశీ కుమార్ Published on 21 Oct 2021 6:19 AM GMTఅధికారం దక్కలేదనే అక్కసుతోనే చీకట్లో రథాలను తగులబెట్టారని, కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో గత రెండున్నరేళ్లుగా కొత్త తరహా నేరగాళ్లను చూస్తున్నామన్నారు. విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం జగన్ పాల్గొని మాట్లాడారు. పోలీసుల సంక్షేమం గురించి ఆలోచించిన తొలి ప్రభుత్వం తమదేనన్నారు. పోలీసులు తమ కుటుంబాలతో గడపాలని, వారికి విశ్రాంతి కావాలన్నారు. అందుకోసం వారికి వీక్లీ ఆప్‌ను ప్రవేశపెట్టామన్నారు. కరోనా మహమ్మారి కారణంగా దీన్ని అమలు చేయలేకపోయామని.. వైరస్ తగ్గుముఖం పట్టడంతో నేటి నుంచి దీన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు.
దేశ వ్యాప్తంగా గత ఏడాది కాలంగా 377 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని.. అందులో మన రాష్ట్రానికి చెందిన వారు 11 మంది ఉన్నారనన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపటనున్నట్లు వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలకు పరిహారం ఇస్తున్నామన్నారు. హోంగార్డల గౌరవ వేతనాన్ని కూడా పెంచామని గుర్తు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ అత్యంత ప్రాధాన్యాంశమన్నారు. శాంతిభద్రతలను కాపాడే క్రమంలో ఏమాత్రం రాజీ పడొద్దని చెప్పారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణాలపైనా సీఎం మాట్లాడారు. అధికారం దక్కలేదనే అక్కసుతోనే పథకం ప్రకారమే రాష్ట్రంలో కుట్ర చేస్తున్నారన్నారు. చీకట్లో విగ్రహాలను ధ్వంసం చేయడం, ఆలయాల రథాలను తగలబెట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం, కోర్టుల్లో కేసులు వేసి సంక్షమ పథకాలను అడ్డుకోవడం వంటివి చేస్తున్నారన్నారు. ఆఖరికి సీఎంపైనా అసభ్య పదజాలం వాడుతున్నారని.. ఓ ముఖ్యమంత్రిపై పరుష పదజాలం వాడటం సమంజసమేనా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని అభిమానించే వాళ్లు తిరగబడాలని.. భావోద్వేగాలు పెరగాలని వాళ్లు ఆరాటపడుతున్నారన్నారు.
అధికారం దక్కలేదని రాష్ట్రం పరువు తీసేందుకు వెనకాడం లేదన్నారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి మత్తు పదార్థాలకు బానిస అయ్యారనే విధంగా ప్రపంచానికి చూపించే ప్రయత్నం జరుగుతోందన్నారు. డ్రగ్స్‌తో ఏపీకి ఎలాంటి సంబంధం లేదని ఏపీ డీజీపీ, డీఆర్‌ఐ చెప్పినా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఓ పథకం ప్రకారమే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.