రాక్షసులతో ఒంటరిగా యుద్ధం చేస్తున్నా: వైఎస్ జగన్
CM Jagan speech in Narasaraopet.పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన వలంటీర్ల సత్కార సభలో
By తోట వంశీ కుమార్ Published on 7 April 2022 3:38 PM ISTపల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన వలంటీర్ల సత్కార సభలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి పక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవనే భయం టీడీపీ అధినేత చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. టీడీపీ, దానికి అనుబంధంగా ఉన్న మరో పార్టీ, అనుకూల మీడియాకు ఇదే భయం ఉందని ఎద్దేవా చేశారు. ఢిల్లీ పర్యటనలో జగన్ కు ప్రధాని మోదీ క్లాస్ పీకారంటూ ఎల్లో మీడియాలో కథనాలు వచ్చాయని... ఎల్లో మీడియా కానీ, దీనికి అనుబంధంగా ఉన్న ఎవరైనా కానీ ఆ సమయంలో మోదీ సోఫా కింద దాక్కున్నారా? అని ప్రశ్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ దొంగల ముఠా అని జగన్ అన్నారు. ఈ ముఠా హైదరాబాద్ లో ఉందని అన్నారు. హైదరాబాద్ లో ఉంటూ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకుని రావాలని ప్రయత్నిస్తూ ఉన్నారన్నారు. వీరు చేసే ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని జగన్ కోరారు. వీరంతా మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలు అని జగన్ అన్నారు. ప్రభుత్వంపై లేనిపోని ప్రచారాలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని జగన్ విమర్శించారు. వీళ్లంతా రాష్ట్రాన్ని దోచుకుని అప్పల పాలు చేశారన్నారు. ఎవరు మంచి చేశారనిపిస్తే వారికే మద్దతివ్వమని జగన్ పిలుపునిచ్చారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ లను ఎట్టిపరిస్థితుల్లో నమ్మవద్దని కోరారు. తాను రాక్షసులతో యుద్ధం చేస్తున్నానని, ప్రజల ఆశీర్వాదం ఉంటే చాలునని జగన్ అన్నారు. పళ్లు కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలు పడతాయని అన్నారు. సంక్షేమ పథకాలతో ప్రతిపక్షం బాక్సులు బద్దలవుతాయని వారికి తెలుసునని అన్నారు.
ప్రస్తుతం తాము రాక్షసులతో, మారీచులతో యుద్ధం చేస్తున్నామని జగన్ అన్నారు. రక్త పిశాచులు, దెయ్యాల మాదిరి ప్రతిపక్షం, దాని అనుకూల పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎవరూ ఓటు వేయరనే భయం వాళ్లతో ఇలాంటి పనులు చేయిస్తోందని అన్నారు. ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేని దుర్మార్గులు, ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం మంచి పాలనను అందిస్తుంటే... ఏపీ ప్రభుత్వం మరో శ్రీలంక అవుతుందని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం వైఎస్ జగన్.