టీడీపీ సభ్యుల నిరసన, సస్పెన్షన్ అనంతరం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా పేరు మార్చారు. బుధవారం మంత్రి రజని ఈ బిల్లును శాసన సభలో ప్రవేశ పెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు.
అన్నీ ఆలోచించిన తరువాతనే పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు కంటే తానే ఎక్కువ గౌరవం ఇస్తానని చెప్పారు. "ఎన్టీఆర్‌ను తక్కువ చేసి మాట్లాడేవారు దేశంలోనే ఉండరు. ఎన్టీఆర్‌పై చంద్రబాబు కంటే నాకే ఎక్కువ గౌరవం. నేను ఎప్పుడూ ఎన్టీఆర్‌ను ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పుడే కాదు గతంలో కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం లేదు. ఆయన్ని ఆగౌరవ పరిచే కార్యక్రమూ ఏనాడు జరగదు. పాదయాత్రలో ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెడతానన్నాను. పేరు పెట్టాను" అని ముఖ్యమంత్రి అన్నారు.
ఎన్టీఆర్ అనే పదం పలకడం కూడా చంద్రబాబుకు ఇష్టం ఉండదని, అదే చంద్రబాబు నోటి వెంట ఎన్టీఆర్ అనే మాట వస్తే పైన ఉన్న ఎన్టీఆర్‌గారికి నచ్చదన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉంటే ఎన్టీఆర్ చాలా కాలం బ్రతికే ఉండేవారని, ఎన్టీఆర్ బ్రతికి ఉంటే చంద్రబాబు సీఎం అయ్యేవారు కాదన్నారు.