విద్యా రంగంపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టాం: సీఎం జగన్‌

CM Jagan said that special focus has been put on the education sector. విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర గురువులదేనన్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌. ఇవాళ భారత మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త

By అంజి  Published on  5 Sep 2022 7:01 AM GMT
విద్యా రంగంపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టాం: సీఎం జగన్‌

విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర గురువులదేనన్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌. ఇవాళ భారత మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా విజయవాడలోని ఎ కన్వేషన్‌ సెంటర్‌లో రాష్ట్ర ప్రభుత్వం గురు పూజోత్సవం కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చీఫ్‌ గెస్ట్‌గా సీఎం జగన్‌ హాజరయ్యారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం సీఎం జగన్ మాట్లాడారు. గురువులకు శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వారికి భవితనిచ్చేది గురువులని అన్నారు. జ్ఞానం పంచి నడక నేర్పించే గురువులందరికీ శుభాకాంక్షలని తెలిపారు.

విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. సీఎంగా విద్యాశాఖపైనే ఎక్కువ సమీక్షలు చేశానని అన్నారు. ఉపాధ్యాయులకు శిఖరం వంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అని, సాన పట్టకపోతే వజ్రమైనా కూడా రాయితోనే సమానం అన్నారు విద్యార్థులను తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులకే ఉందన్నారు. తనకు విద్య నేర్పిన గురువులకు రుణపడి ఉంటానన్నారు. విద్యార్థుల్లో ప్రతిభను టీచర్లే వెలికితీస్తారని సీఎం అన్నారు. తమ ప్రభుత్వం విద్యా రంగంపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిందన్నారు. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

గత ప్రభుత్వం విద్యావ్యవస్థను కార్పొరేట్‌ రంగానికి అమ్ముకుని పేదవర్గాలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి, నాణ్యమైన విద్యను అందించేందుకు అవసరమైన మార్పులు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న నూతన విధానాలు ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయడానికి కాదని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను మెరుగుపరిచేందుకు మాత్రమే మార్పులు తీసుకువస్తున్నామని వెల్లడించారు.

ఉపాధ్యాయులకు సన్మానం​

గురు పూజోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 176 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కరాలను సీఎం జగన్‌ ప్రదానం చేసి సత్కరించారు.

Next Story