ముంపు బాధితులకు రూ.2వేల తక్షణ సాయం : సీఎం జగన్
CM Jagan review on Heavy rains in AP.భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల
By తోట వంశీ కుమార్ Published on 19 Nov 2021 7:12 AM GMTభారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నదులు ఉప్పొంగడంతో పలు చోట్ల వరదలు సంభవించాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభావం అధికంగా ఉన్న చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వరద సహాయక చర్యలను పర్యవేక్షించడానికి మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.
చెరువులకు గండ్లు పడిన చోట తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా ఉండాలన్నారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.2వేలను అందించాలన్నారు. ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి ఈ నగదు ఉపయోగపడుతుందన్నారు. బాధితులకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. మంచి భోజనం, తాగునీరు అందించాలని సూచించారు. వర్షాల తర్వాత కూడా వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇక తిరుపతిలో వరదనీరు నిల్వ ఉండిపోవడానికి గల కారణాలపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. చెరువుల పూడ్చివేత వల్ల ఇది జరిగిందని అధికారులు తెలపడంతో దీని పై తగిన కార్యచరణ సిద్ధం చేయాలన్నారు. తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులకు సహాయంగా నిలవాలని, రైళ్లు, విమానాలు రద్దైన నేపథ్యంలో వారికి అన్నిరకాలుగా తోడుగా ఉండాలన్నారు.
వర్షాల కారణంగా దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.5 లక్షల పరిహారం వీలైనంత త్వరగా అందించాలని.. ప్రభావిత జిల్లాల్లో కాల్‌సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. వచ్చే వినతులపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని.. ఎలాంటి సహాయం కావాలన్న యుద్ధప్రాతిపదికన సమకూరుస్తామని సీఎం జగన్ చెప్పారు.