తుఫాన్ ప్ర‌భావంపై స‌మీక్ష‌.. మృతుల కుటుంబాల‌కు రూ.5ల‌క్ష‌ల సాయం

CM Jagan review on Gulab Cyclone effect on state.గులాబ్ తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల్లో అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Sept 2021 4:04 PM IST
తుఫాన్ ప్ర‌భావంపై స‌మీక్ష‌.. మృతుల కుటుంబాల‌కు రూ.5ల‌క్ష‌ల సాయం

గులాబ్ తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల్లో అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని.. యుద్ద ప్రాతిప‌దిక‌న స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. తుఫాన్ అనంత‌ర ప‌రిస్థితులపై ప్ర‌భావిత ప్రాంతాల క‌లెక్ట‌ర్లు, ఉన్న‌తాధికారుల‌తో సీఎం జ‌గ‌న్ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్ష నిర్వ‌హించారు. సమీక్షలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. వ‌ర్షం త‌గ్గుముఖం ప‌ట్టిన వెంట‌నే యుద్ద ప్రాతిప‌దిక‌న విద్యుత్‌ను పున‌రుద్ద‌రించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్రతి అరగంటకూ విద్యుత్‌ పరిస్థితులపై సమాచారం తెప్పించుకోవాలని సూచించారు. ఇప్ప‌టికే శ్రీకుళంలో ఉన్న సీఎస్ ఆదిత్య‌నాథ్ దాస్‌ను నేడు కూడా అక్క‌డే ఉండి ప‌రిస్థితిని స‌మీక్షించాల్సిందిగా ఆదేశించారు.

మృతుల కుటుంబాల‌కు రూ.5లక్ష‌ల సాయాన్ని వెంట‌నే అందించాల‌ని ఆదేశించారు. మానవతా దృక్పథంతో బాధిత ప్రాంతాల్లో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. బాధితులకు సాయం చేయడంలో వెనకడుగు వేయొద్ద‌న్నారు. స‌హాయ‌క శిబిరాల్లో అందించే ఆహారం నాణ్యంగా ఉండాల‌ని.. మంచి వైద్యం, ర‌క్షిత తాగునీరు అందించాల‌న్నారు. అవ‌స‌రం అయితే.. అన్ని చోట్లా స‌హాయ‌క శిబిరాల‌ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ఇక విశాఖ నగరంలో ముంపు ప్రాంతాల్లో వర్షపు నీటిని పంపింగ్‌ చేసి తొలగించే పనులు ముమ్మరంగా చేప‌ట్టాన్నారు. ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇళ్లలోకి వ‌ర‌ద నీరు చేరి ఇబ్బంది పడుతున్న కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఆయా కుటుంబాల‌కు రూ.1000 చొప్పున ఆర్థిక సాయం అందించాల‌న్నారు. స‌హాయ‌క శిబిరాల నుంచి బాధితులు వెళ్లేట‌ప్పుడు కుటుంబానికి రూ.1000 చొప్పున ఇవ్వాల‌న్నారు. రిజర్వాయర్లలో నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటిని విడుదల చేయాలన్నారు.

Next Story