తీరం దాటిన తుఫాన్.. ఏపీలో భారీ వర్షాలు.. అధికారులతో సీఎం జగన్ సమీక్ష
CM Jagan review meeting on Mandous Cyclone Effect.తమిళనాడులోని మహాబలిపురం వద్ద మాండౌస్ తుఫాను
By తోట వంశీ కుమార్ Published on 10 Dec 2022 5:26 AM GMTతమిళనాడులోని మహాబలిపురం వద్ద మాండౌస్ తుఫాను తీరం దాటింది. పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ శనివారం సాయంత్రం నాటికి వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రేపు(ఆదివారం) కూడా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. తుఫాన్ తీరం దాటినప్పటికి రేపటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.
తుఫాన్ ప్రభావంతో శుక్రవారం రాత్రి నుంచి నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని స్వర్ణముఖి నదికి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది. ఇక తిరుమలలో ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సీఎం జగన్ సమీక్ష..
తుఫాన్ ప్రభావం పై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తుఫాను ప్రభావం పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభావిత ప్రాంతాలు, భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. అవసరం అయితే పునరావాస శిబిరాలను తెరవాలన్నారు.