ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో రైతు భరోసా పథకం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతోనే నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 52.38 లక్షల మంది రైతులకు రూ. 3,928 కోట్ల సాయం అందించినట్లు ఆయన తెలిపారు.
రైతు భరోసా-పీఎం కిసాన్ పథకంలో మూడో ఏడాదికి తొలి విడత సాయం చేస్తున్నామన్నారు. అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా మూడు విడతలుగా రూ.13,500 సాయం అందజేస్తామన్నారు. ఖరీఫ్ ముందు మే నెలలో తొలి విడత కింద రూ.7,500, అక్టోబర్‌లో రూ. 4,000, జనవరిలో రూ. 2,000 సాయం అందజేయనున్నట్లు చెప్పారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని సీఎం జగన్ అన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే రైతు భరోసా పథకం తీసుకొచ్చామన్నారు.
గత ప్రభుత్వం పెట్టిన విత్తన బకాయిలను కూడా చెల్లించామని చెప్పారు. ఇక రైతు భరోసా కింద ఇప్పటివరకు రూ.13,101 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని.. ఈ రోజు విడుదల చేసిన నిధులతో కలిపి మొత్తం రూ.1729 కోట్లు జమ చేశామని.. 23 నెలల పాలనలో రైతులకు రూ. 68 వేల కోట్లు సాయం చేశామని సీఎం జగన్ తెలిపారు.