ఏపీ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. అకౌంట్లలో జగనన్న విద్యా దీవెన డబ్బులు జమ

CM Jagan release Jagananna Vidya Deevena funds.ఏపీలోని విద్యార్థుల‌కు, వారి త‌ల్లుల‌కు సీఎం జ‌గ‌న్ శుభ‌వార్త చెప్పారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 March 2022 12:03 PM IST
ఏపీ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. అకౌంట్లలో జగనన్న విద్యా దీవెన డబ్బులు జమ

ఏపీలోని విద్యార్థుల‌కు, వారి త‌ల్లుల‌కు సీఎం జ‌గ‌న్ శుభ‌వార్త చెప్పారు. 2021 త్రైమాసికానికి సంబంధించి దాదాపు 10.82లక్ష‌ల మంది విద్యార్థుల త‌ల్లుల ఖాతాల్లో జ‌గ‌నన్న విద్యా దీవెన ప‌థ‌కం కింద రూ.709కోట్ల‌ను జ‌మ చేశారు. బుధ‌వారం క్యాంపు కార్యాల‌యంలో సీఎం జ‌గ‌న్ కంప్యూట‌ర్ బ‌ట‌న్ నొక్కి నేరుగా విద్యార్థుల త‌ల్లుల ఖాతాలో న‌గ‌దును జ‌మ చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. ఈ ప్ర‌పంచంలో ఎవ‌రూ దొంగిలించ‌లేని ఆస్తి చ‌దువ‌నేన‌ని అన్నారు. చదువుతో జీవన స్థితిగతుల్లో మార్పు వ‌స్తుంద‌ని తెలిపారు. విద్యాదీవెన, వసతి దీవెన ఎంతో సంతోషాన్ని ఇచ్చే పథకాలన్నారు. జగనన్న విద్యా దీవెన కింద 10.82 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీజురీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్న‌ట్లు చెప్పారు.

జగనన్న విద్యా దీవెన పథకం కింద అర్హులైన పేద విద్యార్థులందరికీ ప్రభుత్వం పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందజేస్తోంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద ఇప్పటివరకు మొత్తం రూ. 9,274 విడుద‌ల చేశారు. గ‌త ప్రభుత్వం పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ. 1,778 కోట్లను జగన్‌ ప్రభుత్వమే చెల్లించింది.

పిల్లల్ని చదివించేందుకు తల్లులకు ఆర్ధికపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి జగన్ అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 44 లక్షల 48 వేల 865 మంది తల్లుల ఖాతాల్లో నేరుగా ఏడాదికి 15 వేల రూపాయలు జమ అవుతున్నాయి. ఫలితంగా 1వ తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న దాదాపు 84 లక్షలమంది విద్యార్ధులకు లబ్ది చేకూరుతోంది.

Next Story