రామాయపట్నం పోర్ట్‌కు భూమిపూజ చేసిన సీఎం జగన్.. పోర్టు ప్రత్యేకతలివే.!
CM Jagan Ramayapatnam port foundation stone event. నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్ట్‌కి సీఎం జగన్ భూమి పూజ చేశారు. ఇవాళ ఉదయం నెల్లూరుకు చేరుకున్న
By అంజి
నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్ట్‌కి సీఎం జగన్ భూమి పూజ చేశారు. ఇవాళ ఉదయం నెల్లూరుకు చేరుకున్న సీఎం.. రామాయపట్నం పోర్ట్ ప్రాంతంలో భూమి పూజ చేశారు. రెండు దశల్లో రూ.10,640 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టింది. భూమి పూజ కార్యక్రమంలో సీఎం జగన్ వెంట మంత్రులు అంబటి రాంబాబు, అమర్నాథ్, స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఉన్నారు.
పోర్ట్ పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత సముద్ర తీరం వరకు వెళ్లి సముద్రుడికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సముద్రంలో ట్రెడ్జింగ్ పనుల్ని ప్రారంభించారు. రామాయపట్నం పోర్టు పైలాన్‌ను జగన్ ఆవిష్కరించారు. రామాయపట్నం పోర్ట్ నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజల ఏళ్లనాటి కల. ఈ పోర్టు అందుబాటులోకి వస్తే ఏపీలో మౌలిక సదుపాయాల రంగానికి కొత్త ఊపు రానుంది. తొలి విడత పనుల్ని ఇవాళ సీఎం జగన్ ప్రారంభించగా వాటిని మూడేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ. 3736.14 కోట్లతో పోర్టు తొలిదశ పనులు ఇవాళ్టి నుంచి మొదలవుతున్నాయి.
ఏపీ మారిటైం బోర్డు కింద రామాయపట్నం పోర్టు ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మిస్తోంది. దీని కోసం రామాయపట్నం పోర్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేశారు. మొదటి దశలో మొత్తం నాలుగు బెర్తులు నిర్మిస్తారు. సంవత్సరానికి 25 మిలియన్ టన్నుల ఎగుమతి లక్ష్యంగా పెట్టుకున్నారు. కార్గో, బొగ్గు, కంటైనర్ల కోసం నాలుగు బెర్తుల నిర్మాణం మొదలు కానుంది.
రెండో విడతలో పోర్టు ఎగుమతి సామర్థ్యాన్ని 138.54 మిలియన్ టన్నులకు విస్తరించనున్నారు. మొత్తంగా 15 బెర్తుల నిర్మాణం అప్పటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు సహా రాయలసీమలోని పలు జిల్లాలు, తెలంగాణలోని నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలకు సంబంధించి పారిశ్రామిక, వాణిజ్య, రవాణా సేవల్లో రామాయపట్నం పోర్ట్ కీలకం కాబోతోంది. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం జాతీయరహదారికి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో పోర్టు నిర్మాణం జరగనుంది.
ముఖ్యాంశాలు
- రామాయపట్నం ఓడ రేవు నిర్మాణం కోసం మొత్తం రూ.10,640 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
- రెండు దశల్లో 19 బెర్త్‌లతో రామాయపట్నం ఓడరేవు నిర్మాణం
- తొలిదశలో రూ.3,736.14 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు మంజూరు
- తొలిదశలో నాలుగు బెర్త్‌లతో ఓడ రేవు నిర్మాణానికి టెండర్లు పిలుపు
రామాయపట్నం పోర్టుతో ప్రయోజనాలు
హార్బర్ల వద్ద విస్తృతంగా ఉపాధి అవకాశాలు.
పెరగనున్న ఆర్థికవ్యవస్థ
వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు
వాణిజ్య, వ్యాపార, రవాణా సేవలు సుభతరం