కడప స్టీల్ ప్లాంట్‌కు సీఎం జగన్ భూమి పూజ
CM Jagan performed Bhoomi Puja for Kadapa Steel Plant. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు.
By అంజి Published on 15 Feb 2023 8:10 AM GMTఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం స్టీల్ ప్లాంట్ మౌలిక సదుపాయాలపై జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. నిరుద్యోగాన్ని పారద్రోలి మెరుగైన జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో సీఎం జగన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు.
భగవంతుడి దయ వల్ల వైఎస్‌ఆర్ కడప జిల్లాలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా ఎక్కువ మందిని పిలవలేకపోయామని చెప్పారు. ఈ ఉక్కు కర్మాగారం రాయలసీమ, కడప ప్రజల కల అని, వైఎస్ఆర్ మరణానంతరం ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదన్నారు. రూ.8,800 కోట్లతో మూడు మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి జరుగుతుందని, ఉక్కు కర్మాగారం ఏర్పాటుతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
ఈ ప్లాంట్‌ను తెచ్చుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. దేవుడి దయ వల్ల మంచి రోజులు వచ్చాయన్నారు. స్టీల్ ప్లాంట్‌తో ఈ ప్రాంతం ఉక్కు నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. గండికోట రిజర్వాయర్ నుంచి ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరా జరుగుతుందన్నారు. మొదటి విడతగా రూ.3,300 కోట్లు, ఏటా 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేస్తామని సీఎం జగన్ చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ గత మూడేళ్లుగా నంబర్ వన్‌గా ఉందన్నారు. రూ.700 కోట్లతో మౌలిక వసతలు అభివృద్ధి చేస్తున్నామన్నారు.