సింహం సింగిల్‌గానే వస్తుంది.. ప్రజలు, దేవుడినే నమ్ముకున్నా: సీఎం జగన్
దశాబ్ధాలుగా అనుభవదారులుగా రైతులకు హక్కులు కల్పిస్తున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
By Srikanth Gundamalla Published on 17 Nov 2023 8:24 AM GMTసింహం సింగిల్‌గానే వస్తుంది.. ప్రజలు, దేవుడినే నమ్ముకున్నా: సీఎం జగన్
ఏలూరు : దశాబ్ధాలుగా అనుభవదారులుగా రైతులకు హక్కులు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పెత్తందార్లకు పేదలను పిలవడం నచ్చదన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిసారిగా భూ సర్వే చేస్తున్నామన్నారు. రెండు విడతల సర్వే పూర్తైందని, మూడో విడత ప్రారంభించబోతున్నామన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. 27లక్షల 42 వేల ఎకరాలకు సంబంధించి16 లక్షల 21వేల మందికి హక్కులు కల్పించ బోతున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో అసైన్డ్ భూములను అత్తగారి సొత్తులా భావించి స్వాధీనం చేసుకునేవారన్నారు. చుక్కల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చంద్రబాబు చేర్చారని జగన్ పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన భూములపై దళిత రైతుల రుణాలు మాఫీ చేస్తూ, సర్వ హక్కులు కల్పించబోతున్నామన్నారు. లంక భూములు సాగు చేసుకుంటున్న రైతులకు మూడు కేటగిరీలుగా పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని జగన్ వెల్లడించారు.
ప్రజలకు మంచి చేసి చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదు: జగన్
చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడినే జరిగిందని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేసి చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదని అన్నారు. తొలిసారి వెన్నుపోటుతో, రెండోసారి కార్గిల్ యుద్ధం పుణ్యాన, మూడోసారి రుణమాఫీతో అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయన్న సీఎం జగన్ చంద్రబాబుకు మిగతా సామాజిక వర్గాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో గుర్తు తెచ్చుకోవాలని ప్రజలకు జగన్ సూచించారు. ఎస్సీల్లో ఎవరైరా పుట్టాలనుకుంటారా, బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన మేనిఫస్టోలపై కమిట్‌మెంట్ లేని నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు ఏపీ సీఎం జగన్.
ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ తోడేళ్లంతా ఏకమవుతున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. దొంగల ముఠా అంతా ఏకమై ప్రతి ఇంటికి బెంజ్ కారు ఇస్తామని చెబుతారు.. నమ్మి మోసపోవద్దని సీఎం జగన్ హితవు పలికారు. 2014 చంద్రబాబు, పవన్ ఏకమై ఇచ్చిన హామీలు నెరవేర్చారా అనే ఆలోచించాలని సూచించారు. తనకు ప్రజా దీవెనలు ఉన్నంత వరకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాలను వ్యవసాయం కోసం కొత్తగా 42,307 మందికి డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారంభించడంతోపాటు అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలు అందజేశారు. చుక్కల భూములు, షరతుల గల పట్టా భూములు, సర్వీస్ ఈనాం భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించడం, భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూములపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాల పంపిణీని సీఎం జగన్ ఈ సభలో ప్రారంభించారు. శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం రాష్ట్రంలో 1,563 గ్రామాల్లో 951 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు.