మొన్న చంద్రముఖి.. నేడు అరుంధతి సినిమా గురించి మాట్లాడిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ మదనపల్లెలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో అరుంధతి సినిమా గురించి ప్రస్తావించారు.

By Medi Samrat  Published on  2 April 2024 2:18 PM GMT
మొన్న చంద్రముఖి.. నేడు అరుంధతి సినిమా గురించి మాట్లాడిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ మదనపల్లెలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో అరుంధతి సినిమా గురించి ప్రస్తావించారు. మీరంతా అరుంధతి సినిమా చూశారా? ఆ సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతి లాగా, ఇప్పుడు ఐదేళ్ల తర్వాత చంద్రబాబు అనే పసుపుపతి అధికారం కోసం వదల బొమ్మాళీ వదల అంటున్నాడు.. పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడుతున్నాడు. నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్నాడని అన్నారు సీఎం జగన్. ఈ పసుపుపతి 2014లోనూ ఇదే మాదిరి ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాడు. ఇంటింటికీ హామీ పత్రం పంపించాడని అన్నారు. ముఖ్యమైన హామీల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక మేనిఫెస్టో ఎన్నికలైపోగానే చెత్తబుట్టలో ఉంటుందని సీఎం జగన్ అన్నారు. గతంలో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చకుండా, మీటింగులు పెడుతూ మరోసారి చంద్రబాబు నాయుడు ఇదే డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు సీఎం జగన్. మళ్లీ పేదల రక్తం పీల్చేందుకు వస్తున్న ఈ పశుపతిని, ఈ పసుపుపతిని ఏ ఒక్కరైనా నమ్మవచ్చా? నమ్మినవారిని నట్టేట ముంచి, అధికారం దక్కించుకోవడానికి, మరోసారి మన రాష్ట్రాన్ని దోచుకోవాలన్నది బాబు ప్లాన్ అని వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్.

వీళ్లకు అధికారం కావాల్సింది దోచుకోవడం కోసం, దోచుకున్నది పంచుకోవడం కోసమేనని సీఎం జగన్ అన్నారు.పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందని కోర్టులకు వెళ్లి అడ్డుకున్న తెలుగు దేశం పార్టీకి సమాధి కట్టాలని సీఎం జగన్ పిలువును ఇచ్చారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు అనుకుంటారు అని ఆ పుట్టుకనే అవమానించిన వారి రాజకీయాలకు చరమగీతం పాడండని అన్నారు సీఎం జగన్.

Next Story