కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అమిత్ షాతో ముఖ్యమంత్రి జగన్ చర్చించారు. రెవిన్యూ లోటు భర్తీ, పోలవరం నిధులపై ఈ సమావేశంలో చర్చించారు. జాతీయ ఆహార భద్రతా చట్టంలో సవరణలు కోరుతున్నారు జగన్. లబ్దిదారుల ఎంపికలో కొన్ని సవరణలు కోరుతున్నారు. దీనిపై అమిత్ షాకు నివేదిక ఇచ్చారు. కొత్త మెడికల్ కాలేజీలు, ఏపీఎండీసీకి గనుల కేటాయింపుపైనా చర్చించారని తెలుస్తోంది. అమిత్ షాతో భేటీ ముగిసిన అనంతరం సీఎం జగన్ విమానాశ్రయానికి బయలుదేరారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్.. వెంటనే ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిధులు, తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు, కొత్త జిల్లాల్లో వైద్య కళాశాల మంజూరు, కడప ఉక్కు కర్మాగారానికి ఇనుప ఖనిజం, రాష్ట్ర రెవెన్యూ లోటు భర్తీ, రుణపరిమితి పునరుద్ధరణ, రేషన్ కోట పెంపు, భోగాపురం విమానాశ్రయానికి అనుమతులు పొడిగింపు, రాష్ట్ర మైనింగ్ శాఖకు బీచ్ శాండ్ కేటాయింపులు వంటి 9 అంశాలతో ప్రధానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్ , గజేంద్ర సింగ్ షెకావత్ తో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం అమిత్ షాను కలిశారు.