50 నెలల్లో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాం : సీఎం జగన్
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
By అంజి Published on 15 Aug 2023 12:00 PM IST50 నెలల్లో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాం : సీఎం జగన్
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు సాయుధ బలగాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం సీఎం జగన్ ప్రసంగించారు. స్వాతంత్ర్య సమరయోధుల బలిదానాన్ని గుర్తు చేస్తూ.. మన జాతీయ జెండా ఎగురుతోందన్నారు. 76 ఏళ్ల ప్రయాణంలో దేశం ఎంతో పురోగమించిందని, వ్యవసాయం, పరిశ్రమ, సేవారంగంలో ఎంతో ప్రగతి సాధించామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని మార్పులు తెచ్చామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలన్నీ అక్కచెల్లెమ్మల పేరు మీదే ఇస్తున్నామని చెప్పారు.
ఇప్పటి వరకు రూ.2 లక్షల 31 వేల కోట్లను నేరుగా ప్రజలకు అందించామన్నారు. ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని సీఎం జగన్ వివరించారు. అర్హులందరికీ పథకాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రైతులకు పెట్టుబడి కోసం రైతు భరోసా అందిస్తున్నామని, విత్తనం నుంచి అమ్మకం వరకూ రైతుకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన సేవలు అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. రైతులను ఆదుకునేందుకు పంటల బీమా అమలు చేస్తున్నామన్నారు. వడివడిగా పోలవరం పనులు జరుగుతున్నాయని, 2025 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని తెలిపారు.
వెలిగొండలో మొదటి టన్నెల్ పూర్తి చేశామని, రెండో టన్నెల్ పనులు త్వరలోనే పూర్తవుతాయన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని, పౌర సేవలను ఇంటింటికి తీసుకెళ్లగలిగామన్నారు. గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీలు తెచ్చామన్నారు. 50 నెలల్లో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చామన్న సీఎం జగన్.. వికేంద్రీకరణలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించామన్నారు. భూవివాదాలకు పరిష్కారం కోసం సమగ్ర సర్వే చేపట్టామని, మూతపడిన చిత్తూరు డైరీకి జీవం పోశామని చెప్పారు. పాల వెల్లువ ద్వారా పాడి రైతులకు అదనంగా ఆదాయం వచ్చేలా చేశామన్నారు.