రెడ్ బుక్‌ని చూసి సీఎం జగన్ వణికిపోతున్నారని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. ఎర్ర బుక్‌పై కూడా ఆయన కేసు పెట్టారని ఎద్దేవా చేశారు. జగన్‌కు ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఇష్టమొచ్చినట్టు మార్చారని అన్నారు. ''బీసీలంటే జగన్‌కు చిన్నచూపని, జగన్ కటింగ్.. ఫిట్టింగ్ మాస్టర్. పైన రూ.10 బటన్ నొక్కి.. కింద రూ.100 లాగుతున్నారు. జగన్ త్వరలో గాలిపైనా కూడా పన్ను వేస్తారు'' అని నారా లోకేష్ విమర్శించారు. బీసీలకు సీఎం జగన్ అన్యాయం చేశారని లోకేష్ మండిపడ్డారు. మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్.. మద్యాన్ని నిషేధించారా? అని లోకేష్ ప్రశ్నించారు.
శృంగవరపుకోటలో నిర్వహించిన టీడీపీ 'శంఖారావం' బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల కన్నీటి నుండి చంద్రబాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో వచ్చిందని లోకేష్ అన్నారు. టీడీపీ మేనిఫెస్టోని చూసి జగన్ భయపడుతున్నారని అన్నారు. ఓ క్రికెటర్ వైసీపీలోకి వస్తే ఎంత ఇస్తావని అతడిని అడిగారని ఆరోపించారు. సీఎం జగన్ పాలనలో ముమ్మాటికీ జరిగింది సామాజిక అన్యాయమేనని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రావాల్సిన 10 శాతం రిజర్వేషన్‌ను కూడా ఇవ్వలేదన్నారు. వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక సీఎం జగన్ అని లోకేశ్ మండిపడ్డారు.