నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటకూరులో ఏపీజెన్‌కో మూడో యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (SDSTPS)లో యుద్ధ ప్రాతిపదికన 800 మెగావాట్ల యూనిట్‌ను సిద్ధం చేసింది. . ప్రభుత్వ రంగంలోనే మొదటిదైన ఈ సూపర్ క్రిటికల్ యూనిట్ ద్వారా రోజుకు 19 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
సాంప్రదాయ థర్మల్ పవర్ ప్లాంట్లతో పోలిస్తే ఈ ప్లాంట్ తక్కువ బొగ్గును వినియోగిస్తుంది. ఇది పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. రోజుకు 9,312 టన్నుల బొగ్గుతో పనిచేసేలా యూనిట్‌ను రూపొందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిలో మరో ముందడుగు పడిందని అన్నారు. సరికొత్త సాంకేతిక పరిజానంతో నిర్మించిన జెన్‌కో మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేశామన్నారు. తన తండ్రి వైఎస్సార్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టును ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని సీఎం అన్నారు.
కృష్ణపట్నం పోర్టు పరిధిలోని మత్స్యకారులు, మత్స్యకారేతరుల స్వప్నం సాకారం అయిందన్నారు. థర్మల్ ప్లాంటు కోసం భూములు ఇచ్చిన రైతులకు నిండు మనసుతో అభివాదం చేస్తున్నానన్నారు. నిర్వాసితుల కుటుంబాలకు వచ్చే నెలలోగా ఉద్యోగాలు ఇస్తామని సీఎం జగన్ చెప్పారు. అందరీ మంచి కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. నక్కలవాగుపై రూ.10 కోట్లతో బ్రిడ్జిని నిర్మిస్తామని సీఎం జగన్ తెలిపారు. చేపల వేటకు అనువుగా 25 కోట్ల రూపాయల వ్యయంతో ఫిషింగ్ జెట్టి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.