దత్తపుత్రుడికి మూడేళ్లకోసారి ఇల్లాలు మారుతుంది: సీఎం జగన్

చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌పై ఏపీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  12 Oct 2023 1:49 PM IST
CM Jagan, Hot comments,  pawan kalyan, chandrababu,

దత్తపుత్రుడికి మూడేళ్లకోసారి ఇల్లాలు మారుతుంది: సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ కాకినాడ జిల్లా సామర్లకోటలో పర్యటించారు. అక్కడ జగన్న కాలనీలో ఇళ్లను ప్రారంభించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. రెండేళ్లోనే పేదల సొంతింటి కల నెరవేర్చామని సీఎం జగన్ చెప్పారు. 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించామని చెప్పారు. ఏపీ వ్యాప్తంగా 17వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని సీఎం జగన్ ప్రకటించారు. సభలో మాట్లాడుతూ సీఎం జగన్ ప్రతిపక్ష నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు కంటిన్యూగా నెలరోజుల పాటు ఏపీలో ఎప్పుడూ లేరని అన్నారు జగన్. అయితే.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో ఉన్నారని అన్నారు. చంద్రబాబు, లోకేశ్, దత్తపుత్రుడు, బాలకృష్ణ ఎవరూ ఏపీలో ఉండరు అని చెప్పారు. చంద్రబాబుకి సొంత ఇళ్లు పక్క రాష్ట్రంలో ఉందన్నారు. అలాగే దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని చెప్పారు. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌పై సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. పవన్‌ ప్యాకేజీ స్టార్, దత్త పుత్రుడు అంటూ ఎద్దేవా చేశారు. ఇక పవన్‌ వ్యక్తిగత విషయాలను జగన్ మరోసారి ప్రస్తావించారు. పవన్‌ సొంత ఇల్లు హైదరాబాద్‌లో ఉందనీ.. ఆయన ఇల్లాలు మూడు నాలుగేళ్లకు ఒకసారి మారుతుందని కౌంటర్ వేశారు. ఓసారి లోకల్ .. మరోసారి నేషనల్.. తర్వాత ఇంటర్నేషనల్‌ అన్నారు. కానీ.. ఈసారి ఏం చేస్తారో అంటూ పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగత జీవితంపై కామెంట్స్‌ చేశారు. పవన్‌ కళ్యాణ్‌కు ఆడవాళ్లపై ఎలాంటి గౌరవం ఉందో ప్రజలు ఆలోచించాలని జగన్ కోరారు. నాయకులుగా ఉంటూ భార్యలను ఇలా మారిస్తే ఎలా అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు.

సరుకులు అమ్ముకునే వారిని చూశాం కానీ.. అభిమానుల ఓట్లను అమ్ముకుంటున్న వ్యక్తి పవన్ అంటూ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు సినిమా షూటింగ్‌ల మధ్య విరామాల సమయంలో.. అప్పుడప్పుడు కనిపించడం ఇది పవన్‌ వంటి వ్యక్తులకే చెందుతుందన్నారు. విలువలు లేని వ్యక్తికి ప్రజలే బుద్ధి చెప్పాలని సీఎం జగన్ అన్నారు. ఇక చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారనీ.. రాష్ట్రంలో ఎవరికీ ఇంటి జాగా ఇవ్వలేదన్నారు జగన్. చంద్రబాబు సొంతిల్లు పక్కరాష్ట్రంలో ఉంటే.. ఇక్కడ ఏం చేస్తారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో దత్తపుత్రుడికి, చంద్రబాబుకి.. ఆయన బావమరిదికి ప్రజలు బుద్ధి చెప్పాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.

Next Story