2024లో వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా, ప్రతిపక్షాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఇప్పటి వరకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పార్టీ సోషల్ మీడియాను చూస్తున్నారు. అయితే పని ఒత్తిడి కారణంగా ఆయన సక్రమంగా దృష్టి సారించలేకపోతున్నారని సీఎం జగన్ భావించినట్లున్నారు. అందుకే సీఎం జగన్ దిద్దుబాటు చర్యలు చేపట్టారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డికి వైసీపీ అధినేత, సీఎం జగన్.. సోషల్ మీడియా విభాగం బాధ్యతలు అప్పగించారు.
భార్గవ్‌తో పాటు సోషల్ మీడియా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఇతర వైసీపీ నేతలతో సీఎం జగన్ రెండు గంటలపాటు సమావేశమయ్యారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో కౌంటర్ స్ట్రాటజీ టీమ్ అవసరమని వైఎస్ జగన్ భావించారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాను, సోషల్ మీడియాను ఒకే వ్యక్తి నిర్వహిస్తే మంచి సమన్వయం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగించుకోవడం ద్వారా తమ ప్రభుత్వ సామాజిక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించి వక్రీకరించిన వాస్తవాలకు స్వస్తి పలకాలన్నారు.
ఇటీవల కాలంలో ప్రభుత్వంపైనా, జగన్ కుటుంబంపైనా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులకు సక్రమంగా వైసీపీ వింగ్ స్పందించడం లేదని జగన్ భావిస్తున్నారు. అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సజ్జల కుమారుడు భార్గవ్‌ను నియమించినంత మాత్రాన .. సోషల్ మీడియా వింగ్ గాడిన పడుతుందా? అనే చర్చకు తెరలేచింది.