సీఎం జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. 50 వేల మంది పేదలకు భూపట్టాలు
గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో నిరుపేదలకు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటును వెంటనే పూర్తి చేయాలని
By అంజి Published on 12 May 2023 8:00 AM ISTసీఎం జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. 50 వేల మంది పేదలకు భూపట్టాలు
విజయవాడ : గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో నిరుపేదలకు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటును వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అధికారులను గురువారం ఆదేశించారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ఉచిత ఇళ్ల స్థలాల పథకం పెదలందరికి ఇల్లు-నవరత్నాలను సమీక్షించిన ముఖ్యమంత్రి 21 లేఅవుట్లలో 1,402.58 ఎకరాల్లో 50,004 మందికి భూ పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇందుకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నామని, 21 లేఅవుట్లలో 10 గుంటూరు లబ్ధిదారులకు, 11 ఎన్టీఆర్ జిల్లా లబ్ధిదారులకు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం అటవీ క్లియరెన్స్ పొంది ల్యాండ్ లెవలింగ్ పనులు పూర్తయ్యాయని, అంతర్గత గ్రావెల్ రోడ్లు వేయడానికి మార్గం సుగమం చేసినట్లు అధికారులు తెలిపారు. 180 కిలోమీటర్ల మేర రోడ్లు వేయడానికి త్వరలో పనులు చేపడతామన్నారు. ఇతర పనులపై దృష్టి సారించిన అధికారులు హైకోర్టు ఆవరణలో అదనపు భవన నిర్మాణం తుదిదశకు చేరుకున్నట్లు ముఖ్యమంత్రికి తెలిపారు. 76,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనంలో 14 కోర్టు హాళ్లు ఉంటాయి.
CITIIS (సిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ టు ఇన్నోవేట్, ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్) ప్రాజెక్ట్‌ను కూడా సమావేశంలో ప్రస్తావించారు. ఈ కార్యక్రమం కింద పనులు 12 పట్టణ ప్రాంతాలలో వేగవంతం అవుతున్నాయని అధికారులు తెలిపారు. ఫేజ్-1 కింద 1.5 లక్షల లక్ష్యానికి గాను 1.39 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేశామని, 30 ప్రాంతాల్లో 51,564 ఇళ్లను లబ్ధిదారులకు అందజేసినట్లు అధికారులు వివరించారు. జూన్ నాటికి మిగిలిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని, ఫేజ్-2 కింద మరో 1,12,092 ఇళ్లను సెప్టెంబర్-డిసెంబర్‌లోపు లబ్ధిదారులకు మంజూరు చేస్తామని చెప్పారు. జూన్ మొదటి వారంలో గుడివాడలో 8,192 టిడ్కో ఇళ్లను ముఖ్యమంత్రి పంపిణీ చేసేందుకు సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు.
ఈ సమావేశంలో వైజాగ్ బీచ్‌లలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన ప్రత్యేక యంత్రాలను బీచ్‌లో అందుబాటులో ఉంచి వ్యర్థాలను తొలగించి పర్యాటకాన్ని మెరుగుపర్చాలి.. అంతే కాకుండా విజయవాడలో ముంపు ముప్పు నుంచి కృష్ణా నదిని కాపాడేందుకు నిర్మించిన రిటైనింగ్ వాల్‌కు సమీపంలో ఉన్న నదీగర్భాన్ని అధికారులు సుందరీకరించాలని అధికారులకు సీఎం ఆదేశం జారీ చేశారు. వాకింగ్ ట్రాక్‌తో సహా నదీగర్భం సుందరీకరణ పనులు జరుగుతున్నాయని అధికారులు చెప్పగా, ఇందుకు సంబంధించిన పత్రాలను పరిశీలించిన తర్వాత పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.