ఫైన్ తో సహా ఆస్తి పన్నును చెల్లించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
CM Jagan finally paid house tax.ఓ వైపు ఆంధ్రప్రదేశ్ లో ఆస్తి పన్నులు పెంచడంపై తీవ్ర వ్యతిరేకత
By తోట వంశీ కుమార్ Published on 3 July 2021 2:01 PM ISTఓ వైపు ఆంధ్రప్రదేశ్ లో ఆస్తి పన్నులు పెంచడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉండగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంటికీ, కార్యాలయానికి కూడా ఇంటి పన్ను పెండింగ్ ఉందంటూ వార్తలు వచ్చాయి. ఈ సమయంలో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇంటికి, ఆయన కార్యాలయానికి మూడేళ్లకు రూ.16,90,389 ఆస్తి పన్ను శుక్రవారం చెల్లించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వార్డు నంబరు 12లోగల ఆంధ్రరత్న కట్ట వద్ద పార్సివిల్లే-47లోని డోరు నంబరు 12-353/2/2లో భవనానికి, ఇదే ప్రాంగణంలోని డోరు నంబరు 12-353/2/5లోని మరో భవనానికి 2019-20, 2020-21, 2021-22 సంవత్సరాలకు ఆస్తి పన్నును మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థకు జమ చేశారు. ఈ రెండు భవనాలూ సీఎం జగన్ భార్య వైఎస్ భారతి పేరుతో ఉన్నాయి. మొదటి భవనానికి అపరాధ రుసుముతో కలిపి రూ.16,19,649, రెండో భవనానికి అపరాధ రుసుములతో కలిపి రూ.70,740 చొప్పున చెల్లించారు.
ముఖ్యమంత్రి జగన్‌కు తాడేపల్లిలో భారీ నివాసం ఉంది. అందులో రెండు బ్లాక్‌లున్నాయి. 1750 చదరపు మీటర్ల పరిధిలో ఆఫీసు ఉంది. ఇందులో గ్రౌండ్‌ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాయి. మునిసిపల్ రికార్డు ప్రకారం దీని చిరునామా డోర్ నంబరు 12-353/2/2 పార్సివిల్లే 47, ఆంధ్రరత్న కట్ట, రెవెన్యూ వార్డు నంబరు 12, తాడేపల్లి - 522501. ఇదే ఆవరణలో 219 చదరపు మీటర్లలో నివాసం ఉంది. దీని డోర్ నంబర్ 12-353/2/5. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు ఉన్నాయి. ఈ రెండూ సీఎం సతీమణి వైఎస్ భారతీ రెడ్డి పేరిట ఉన్నాయి. మునిసిపల్ రికార్డుల ప్రకారం ఆఫీసు కోసం ఉపయోగిస్తున్న భారీ భవనాన్ని కమర్షియల్‌గా, ఇంటిని నివాస ప్రాంతంగా చూపించారు. వార్షిక రెంటల్ విలువను ఆఫీసుకు రూ. 13,64,131గా, ఇంటికి రూ.79,524 చూపించి ఆ మేరకు ఆస్తి పన్ను నిర్ణయించారు. దీని ప్రకారం ఆఫీసుకు ఏటా రూ.4,41,980 ఇంటికి 19,752 చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంది.
2019లో జగన్ సీఎం అయినప్పటి నుంచి ఆస్తి పన్ను కట్టడం లేదు. ఈ విషయం రెండు రోజుల క్రితం వెలుగులోకి రావడంతో ప్రతిపక్షాలతో పాటు సోషల్‌మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కొత్త కొత్త జీవోలు తెచ్చి ప్రజలపై పన్ను భారం పెంచుతున్నారని పలువురు నాయకులు విమర్శించారు. మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో జీవో నెంబర్ 196,197,198 తెచ్చి ఇంటి పన్ను, ఆస్తి పన్ను, చెత్త పన్నులను అమాంతం పెంచారని ఆరోపించారు.