ఇళ్లు అనేది ఒక శాశ్వత చిరునామా, తరువాతి తరానికి ఇచ్చే ఆస్తి అని సీఎం జగన్ అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో 1.23 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 30.70లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని, మరో 15.60లక్షల ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభమైందన్నారు.
ఇళ్లు అనేది ఒక శాశ్వత చిరునామా, తరువాతి తరానికి ఇచ్చే ఆస్తి. అలాంటి ఇళ్లను ఇవ్వడం ద్వారా ఒక సామాజిక హోదా కల్పించినట్లు అవుతుందన్నారు. ఇంటి నిర్మాణం, మౌళిక సదుపాయాలతో కలిపి రూ.10లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. ఆ ఖర్చును ఓ అన్నగా, తమ్ముడిగా అక్క చెల్లెమ్మల తరుపున భరించే అవకాశం ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపారు.
16 నెలల కిందటే ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అనుకున్నామని, అయితే.. ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందనని కొందరు కడుపు మంట ఎక్కువై కోర్టులో కేసులు వేశారని జగన్ ఆరోపించారు. ఇప్పటికి కల సాకారమైందన్నారు. కోర్టు వ్యవహారాలు పూర్తి కావడానికి 489 రోజులు పట్టిందన్నారు. దేవుడి దయ వల్ల సమస్య తీరిపోయి లక్షల మందికి మేలు చేసే అవకాశం కలిగినందుకు ఆనందంగా ఉందన్నారు.
ఇళ్లు లేని వారు ఎవరైనా ఉంటే సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే.. అర్హులైన వాళ్లకు స్థలం ఇప్పిస్తానని అన్నారు. ఈ కార్యక్రమం తరువాత రాష్ట్రంలో ఇంటి అడ్రస్ లేకుండా ఒక్క కుటుంబం కూడా ఉండబోదని సీఎం అన్నారు.