వైద్య, ఆరోగ్య శాఖపై శుక్రవారం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సమీక్షలో మంత్రి విడదల రజినీ, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 1 నుంచి ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే అదే రోజు నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆసుపత్రులను సందర్శించాలని కోరారు.
గోరుముద్ద పథకంలో భాగంగా పిల్లలకు వారానికి మూడుసార్లు రాగిమాల్ట్ పంపిణీని మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న, కొత్తగా నిర్మించిన అన్ని బోధనాసుపత్రుల్లో క్యాన్సర్ నివారణ పరికరాలు, చికిత్సలతో పాటు క్యాథ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. కాగా ఇటీవలే మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో రెండో దశలో భాగంగా రూ. 112.62 కోట్లతో 165 డా. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ అంబులెన్సులను సీఎం జగన్ అందుబాటులోకి తీసుకొచ్చారు.