కర్ఫ్యూ నిబంధనల్లో సడలింపు.. అతిక్ర‌మిస్తే క‌ఠిన చ‌ర్య‌లు

CM Jagan Covid control review meeting.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌ర్ఫ్యూ స‌మ‌యాన్ని మ‌రో గంట స‌డ‌లిస్తున్న‌ట్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Aug 2021 2:35 AM GMT
కర్ఫ్యూ నిబంధనల్లో సడలింపు.. అతిక్ర‌మిస్తే క‌ఠిన చ‌ర్య‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌ర్ఫ్యూ స‌మ‌యాన్ని మ‌రో గంట స‌డ‌లిస్తున్న‌ట్లు సీఎం జ‌గ‌న్ తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో ఉద‌యం 6 నుంచి రాత్రి ప‌ది గంట‌ల వ‌ర‌కు వెసులు బాటు ఉండ‌గా మ‌రో గంట అద‌నంగా అంటే రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ స‌మ‌యాన్ని పొడిగించారు. కోవిడ్ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై మంగ‌ళ‌వారం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. స్కూళ్లలో ఖచ్చితంగా కొవిడ్‌ ప్రోటోకాల్స్ పాటించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాల‌ని సూచించారు. ఎవరికైన లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహించాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పాటించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. వ్యాక్సినేషన్‌లో గ్రామ, వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్‌ ఇచ్చుకుంటూ వెళ్లాలన్నారు. ప్రతీ పాఠ‌శాల‌లో టెస్టింగ్‌కు కావాల్సిన ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇక వివాహాల‌కు 150 మందికి మాత్రమే అనుమతి ఉందన్నారు. తెల్లవారుజామున పెళ్లిళ్లు ఉంటే ముందస్తుగా అనుమతి తప్పనిసరన్నారు. పీహెచ్‌సీలు మొద‌లుకొని బోధ‌నాసుప‌త్రుల వర‌కు అవ‌స‌ర‌మైన నియామ‌కాల‌న్నీ 90 రోజుల్లోగా ముగించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని సీఎం జగన్ తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రికవరీ రేటు 98.45 శాతం ఉందని వైద్యశాఖ అధికారులు సీఎంకు వివరించారు. 10 జిల్లాల్లో 3 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉందని మిగతా మూడు జిల్లాల్లో 3 నుంచి 6 శాతంలోపు పాజిటివిటీ రేటు ఉందని చెప్పారు. థర్డ్ వేవ్‌కు సన్నద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

Next Story