బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా జనసేనకు రాలేదు: సీఎం జగన్
శ్రీకాకుళం జిల్లా పలాసలో సీఎం జగన్ పర్యటించారు.
By Srikanth Gundamalla Published on 14 Dec 2023 8:39 AM GMTబర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా జనసేనకు రాలేదు: సీఎం జగన్
శ్రీకాకుళం జిల్లా పలాసలో సీఎం జగన్ పర్యటించారు. ఉద్దానం కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే పలు పలు ప్రాజెక్టును సీఎం జగన్ ప్రారంభించారు. అలాగే వైఎస్‌ఆర్ సుజలధార సురక్షిత తాగునీటి ప్రాజెక్టును సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. రూ.700 కోట్ల వ్యంతో సుజలధార ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది ఏపీ ప్రభుత్వం. రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్‌ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించారు. అంతేకాదు.. 200 పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కూడా సీఎం జగన్ ప్రారంభించారు. సుజలధార పథకంతో 6.78 లక్షల జనాభాకు సురక్షిత తాగునీరు అందనుంది. 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత నీటి సరఫరా జరగనుంది. ఉద్దానం ప్రాంతానికి పూర్తిగా మంచినీటి కష్టాలు తీరిపోనున్నాయి.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల బతుకులు మార్చాలి అనే తపన మీ బిడ్డకు మాత్రమే ఉంటుందనీ.. పేదల ప్రాణాలు అంటే చంద్రబాబుకి లెక్కలేదు అంటూ విమర్శించారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి కూడా నీరు అందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గాన్నే పట్టించుకోని చంద్రబాబు.. ఉత్తరాంధ్రకు ఏం మంచి చేస్తారంటూ ప్రశ్నించారు. ఎన్నికలు వస్తే చాలు ఎత్తులు, పొత్తులు, చిత్తుల మీద చంద్రబాబు ఆధారపడతారంటూ సీఎం జగన్ విమర్శించారు.
చంద్రబాబుకి నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ ఇంకో పార్ట్‌నర్ అంటూ పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డారు సీఎం జగన్. ప్యాకేజీ స్టార్ ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణలో డైలాగ్స్ కొడతారని అన్నారు. తెలంగాణలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడారు అని అన్నారు. అయినా కూడా తెలంగాణలో పవన్‌కు డిపాజిట్లు కూడా రాలేదంటూ ఎద్దేవా చేశారు. ప్యాకేజీ స్టార్.. మ్యారేజీ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. తెలంగాణలో స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క పోటీ చేసిందని గుర్తు చేశారు. ఆమెకు వచ్చిన ఓట్లు కూడా జనసేన అభ్యర్థులకు పడలేదని విమర్శించారు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదంటూ సీఎం జగన్ మండిపడ్డారు. విశాఖను రాజదాని చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.