175 కి 175.. ఇదే మ‌న ల‌క్ష్యం : సీఎం జ‌గ‌న్‌

CM Jagan comments in Gadapa Gadapaku Mana Prabhutvam workshop.వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 కి 175 స్థానాల్లో విజ‌యం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jun 2022 7:59 AM GMT
175 కి 175.. ఇదే మ‌న ల‌క్ష్యం : సీఎం జ‌గ‌న్‌

వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 కి 175 స్థానాల్లో విజ‌యం సాధించే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ శ్రేణుల‌కు సూచించారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంపై వ‌ర్క్ షాప్ నిర్వ‌హించారు. మంత్రులు, రీజనల్ కో ఆర్డినేటర్స్, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు వర్క్‌షాప్‌కు హాజరయ్యారు.

ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. గడపగడపకూ అనేది నిరంతరాయంగా జరిగే కార్యక్రమని అన్నారు. దాదాపు 8 నెలలపాటు ఈకార్యక్రమం జరుగుతుంద‌ని తెలిపారు. ఒక్కో సచివాలయానికి రెండు రోజులపాటు కేటాయిస్తామ‌న్నారు. నెలలో 20 రోజుల చొప్పున 10 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం ఉంటుంద‌న్నారు. గడపగడపకూ కార్యక్రమాన్ని ఏరకంగా చేశాం? ఎలా చేస్తున్నాం? ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలి? ఎలా సమర్థత పెంచుకోవాలి? అన్నదాన్నికూడా మనం నిరంతరంగా చర్చించుకోవాల‌ని అందుకోసం నెలకోసారి వర్క్‌షాపు నిర్వహించ‌నున్న‌ట్లు చెప్పారు.

ఆ నెల రోజుల్లో చేపట్టిన గడపగడపకూ కార్యక్రమం, ఈ కార్యక్రమం ద్వారా మనకు వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌పై ఈ వర్క్‌షాపులో చర్చిస్తాం అని అన్నారు. ఇంకా మెరుగ్గా, సమర్థవంతంగా కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్నదానిపై ఈ వర్క్‌షాపుల్లో దృష్టిసారిస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధుల నుంచి ఈ వర్క్‌షాపుల్లో సూచనలు, సలహాలు కూడా నిరంతరంగా తీసుకుంటాం, వాటిపై చర్చిస్తాం. దీనివల్ల మన ప్రయాణం మరింత మెరుగ్గా సాగుతుంది. గ‌త ఎన్నిక‌ల్లో 151 సీట్లు వ‌చ్చాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 కి 175 సాధించాల‌న్నారు.

Next Story