ఇసుక రీచ్‌లలో వినియోగదారుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన తవ్వకాల ఖర్చు మాత్రమే తీసుకోవాలని, దానికి అదనంగా ఎటువంటి వసూళ్లు ఉండకూడదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, రవాణాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సూచనలు జారీ చేశారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, రవాణాపై గనుల శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇసుక తవ్వకాలు, రవాణాను అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని, ఇసుక దొరకడం లేదన్న మాట ఎవరి నోటా వినిపించకూడదన్నారు.
ఇసుక రీచ్‌ల నుంచి ఇసుక తీసుకెళ్లిన ప్రతి వినియోగదారుడితో మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు ఫోన్లు చేసే ఐవీఆర్ఎస్‌ను రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ తో అనుసంధానించాలని చంద్రబాబు సూచించారు. ఇసుకకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని రీచ్‌లు అందుబాటులోకి తీసుకురావాలని, మాన్యువల్, సెమీ మెకనైజ్డ్‌గా తవ్వకాలకు అవసరమైన అనుమతులు అన్నీ తీసుకోవాలన్నారు. ఇసుక రవాణా ఖర్చులు మరింత తగ్గించేలా చూడాలని సూచించారు. ఇతర రాష్ట్రాలకు ఇసుక అక్రమంగా తరలించకుండా అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద నిఘా కోసం తగిన సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.