'ఆర్ఆర్ఆర్' సినిమాలాగే 'పొలిటికల్ ట్రిపుల్ ఆర్' సంచలనం సృష్టించారు : సీఎం చంద్రబాబు
ఎంతో మంది యువ నాయకులకు రఘురామకృష్ణరాజు ఆదర్శంగా నిలుస్తారు’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
By Medi Samrat Published on 14 Nov 2024 5:57 PM IST'సభాపతి కుర్చీకి రఘురామకృష్ణరాజు నిండుతనం తెచ్చారు. డిప్యూటీ స్పీకర్ గా కొత్త బాధ్యతల్లో ఆయన్ను చూస్తుంటే సంతోషంగా ఉంది. కుర్చీ ఔన్నత్యాన్ని మరింత పెంచేలా సభలో వ్యవహరించాలని కోరుతున్నా. ఎంతో మంది యువ నాయకులకు రఘురామకృష్ణరాజు ఆదర్శంగా నిలుస్తారు’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శాసనసభ ఉప సభాపతిగా ఎన్నికైన రఘురామకృష్ణరాజుకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సభ్యులతో కలిసి రఘురామకృష్ణరాజును సభాపతి కుర్చీవరకు తీసుకెళ్లి ఆసీనులను చేశారు. అనంతరం సీఎం మాట్లాడారు.
ట్రిపుల్ ఆర్ సినిమాలాగే పొలిటికల్ ట్రిపుల్ ఆర్ సంచలనం సృష్టించారు
‘సినిమా రంగంలో ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో.. నేటి రాజకీయాలలో ఆర్ఆర్ఆర్(రఘురామకృష్ణరాజు) చరిత్ర కూడా అంత సంచలనం సృష్టించింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంత ఫేమస్ అయిందో రఘురామకృష్ణరాజు చేపట్టిన రచ్చబండ కార్యక్రమం కూడా అలాగే ఫేమస్ అయింది. జీవితంలో ఒక్కోసారి సమస్యలు వస్తాయి. వచ్చిన సమస్యలను ధైర్యంగా రఘురామ ఎదుర్కొన్నారు. పారిశ్రామిక వేత్తగా, రాజకీయ వేత్తగా రఘురామకృష్ణరాజు గుర్తింపు తెచ్చుకున్నారు. రఘురామకృష్ణరాజు రాజకీయ కుటుంబం నుండి వచ్చారు. వారి తాత జీఎస్ రాజు 1958 నుండి 64 వరకు ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు మొదటి డిప్యూటీ చైర్మన్ గా ఉన్నారు. 2019లో నర్సాపురం ఎంపీగా రఘురామకృష్ణరాజు గెలిచారు. ఆయన ఆలోచనా విధానం, వ్యక్తిత్వం వేరు. కల్మషం లేకుండా మాట్లాడతారు. ఏవైనా తప్పులుంటే కుండ బద్దలు కొట్టినట్లు చెప్తారు. గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపడంతోనే టార్చర్ అనుభవించారు. గత ప్రభుత్వం టెర్రరిజాన్ని ప్రోత్సహించింది. సొంత పార్టీ ఎంపీ విభేదిస్తే ఎవరైనా దూరంగా ఉంటారు. కానీ ఆయనపై వ్యక్తిగతంగా కక్షగట్టి కుట్ర పన్నారు. బెదిరించి, భయపెట్టాలని చూశారు...అయినా తగ్గలేదు. రాజద్రోహం కేసు పెట్టారు. 2021లో మే 14న ఆయన పుట్టిన రోజునాడే అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందారు. పోలీస్ కస్టడీలో టార్చర్ పెట్టడం సంచలనం అయింది. కొంతమంది ఐపీఎస్ ల ద్వారా ఒక ఎంపీని హింసించిన ఘటన దేశ రాజకీయాల్లో ఎప్పుడూ లేదు...ఇదే మొదటిది..ఆఖరి సంఘటనగా ఉంటుంది. ప్రభుత్వాన్ని కూలదోయడానికి టీవీ5, ఏబీఎన్ తో కలిసి కుట్రలు కుట్రలు చేశారని కేసులు పెట్టారు. కేసు పెట్టిన గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి మధ్యాహ్నంకే అరెస్టు చేశారు. శుక్రవారం వస్తే రాష్ట్రంలో కూల్చివేతలు, అరెస్టులు జరిగేవి. శుక్రవారం సాయంకాలం అరెస్టు చేస్తారు...శని, ఆదివారాలు కోర్టులకు సెలవులు కాబట్టి. రాష్ట్రంలో ఎవర్ని అరెస్టు చేసినా పార్టీలతో సంబంధం లేకుండా పోరాడి బయటకు తీసుకొచ్చాం. రఘురామకృష్ణరాజు కేసును నేనే స్వయంగా పర్యవేక్షించాను. అరెస్టు చేసి కస్టడీలో ముసుగు వేసి ఐదుగురు పోలీసులతో కొట్టించారు.’ అని అన్నారు.
భోగీకి నిప్పుపెట్టి అంతమొందించాలని పన్నాగం
‘రఘురామకృష్ణరాజును అరెస్టు చేసినప్పుడు తాళ్లతో కాళ్లు కట్టేసి లాఠీలు, రబ్బరు బెల్టుతో కొట్టించారు. హార్ట్ సర్జరీ చేసుకున్నారన్న కనికరం కూడా లేకుండా ఛాతీపై కొట్టారు. సీఎం బెయిల్ రద్దు చేయమంటావా అని తీవ్రంగా బూతులు తిడుతూ కొట్టారు. కస్టడీలో కొట్టిన విషయం కోర్టులో చెప్తే మళ్లీ కస్టడీలోనే చంపేస్తాం అని బెదిరించారు. అయినా మెజిస్ట్రేట్ వద్ద తనను కొట్టినట్లు ధైర్యంగా రఘురామకృష్ణరాజు చెప్పారు. మెడికల్ రిపోర్టులు కూడా తారుమారు చేశారు. కక్ష మళ్లీ అంతటితో ఆగలేదు. నర్సాపురంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణకు ప్రధాని వచ్చారు. స్థానిక ఎంపీ కావడంతో రఘురామకృష్ణరాజు కూడా వెళ్లడానికి ప్రయత్నిస్తే భోగీ తగలబెట్టి మట్టుబెట్టాలని చూశారు. ఐదేళ్ల పాటు సొంత నియోజకవర్గానికి రాలేకపోయారు. దీంతో రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు జరిగిన పరిణామాలు వివరించి ఆదరణ పొందారు. అందుకే ట్రిపుల్ ఆర్ సినిమా మాదిరి ఈయన కూడా రఘురామకృష్ణరాజు కూడా సంచలనం అయ్యారు. దేశంలో ఇలాంటి ఘటన ఎక్కడైనా జరిగిందా అని అధ్యయనం చేశాను. నేను జైల్లో ఉన్నప్పుడు నా రూములో సీసీ కెమెరాలు పెట్టి నా కదలికలు చూడాలని చూశారు. రఘురామకృష్ణరాజును కూడా కొట్టి సీసీ కెమెరాల్లో చూసి రాక్షసానందం పొందారు. ఈ విషయం మొదట నమ్మలేదు...కానీ నా అరెస్టు సమయంలో గదిలో సీసీ పెట్టి చూడాలని ప్రయత్నించారని తెలిసినప్పుడు నా అభిప్రాయం నిజమైంది.
ఒక్క రోజు కూడా సభలో బూతుల్లేకుండా లేదు
‘గతంలో ఇలాంటి ఘటనలు కొలింబియాలో 1980 నుండి 1985 మధ్య ఎస్కోబార్ చేశాడు. కొలంబియాలో అత్యంత ధనికుడు, దుర్మార్గుడిగా ప్రాబ్లో ఎస్కోబార్ ఉన్నారు. ప్రపంచమంతా కొకైన్ సరఫరా చేసి ప్రపంచంలోనే డ్రగ్ స్మగ్లర్ గా మారాడు. గత పాలకులు కూడా రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ను తెచ్చి పెట్టారు. ఒక్క రోజు కూడా గంజాయి నివారణపై మాట్లాడలేదు. యువత పాడయ్యారు...రాష్ట్రంలో నేరాలు ఘోరాలు జరిగాయి. ఎస్కోబార్ 1985లో న్యాయస్థానంపై గెరిల్లా యుద్ధం చేసి 11 మంది న్యాయమూర్తులను చంపారు. ప్రజాస్వామ్యంలో కోర్టులు ఉండటం వల్ల రఘురామకృష్ణరాజు ప్రాణాలతో బయటపడగలిగారు. ఎస్కోబార్ కు రాష్ట్రంలోని గత పాలకుడికి తేడాలేదు. రాష్ట్రంలో ఎవరు గంజాయి అమ్మినా, పండించినా ఉక్కుపాదంతో అణచివేస్తాం. ప్రజాప్రతినిధులు చట్టసభకు వచ్చి ప్రజల సమస్యలపై పోరాడాలి. నేను ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు చేశాను...ప్రతిపక్ష నేతగా సభలో కూర్చున్నాను. గత ఐదేళ్లు ఒక్క రోజు కూడా అసెంబ్లీ సజావుగా సాగడంగానీ, బూతుల్లేకుండా ఉండటంగానీ జరగలేదు. నాకు కూడా ఈ సభలో అవమానాలు జరిగాయి. కౌరవ సభలో ఉండలేను, ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా మార్చాకే వస్తానని శపథం చేశాను.’ అని చంద్రబాబు గుర్తు చేశారు.
ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే వచ్చేది.. నాయకులు ఇస్తే వచ్చేది కాదు
‘రఘురామకృష్ణరాజు.. సభాపతి కుర్చీ గౌరవాన్ని కాపాడి, మీ గౌరవాన్ని కూడా కాపాడుకోవాలి. ఇక్కడ చాలా మంది గత ప్రభుత్వ బాధితులు ఉన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. ఆయనపై రేప్ కేస్ పెట్టారు. అన్యాయంగా రేప్ కేస్ పెట్టిన అయ్యన్నపాత్రుడుని ప్రజాస్వామ్యం స్పీకర్ చేసింది. చంపేయాలనుకున్న రఘురామకృష్ణరాజును డిప్యూటీ స్పీకర్ చేసింది. అహంకారంతో విర్రవీగిన వారికి ప్రజలు కాల్చి వాత పెట్టారు. వైనాట్ 175 అంటే ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. నా ప్రతిపక్ష హోదా తీస్తానని ఇదే సభలో మాట్లాడారు.. కానీ ప్రజలు వాళ్లకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే వస్తుంది.. నాయకులు ఇచ్చేది కాదు. ప్రజలు ఓట్లేసినప్పుడు 10 శాతం సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది. లేని ప్రతిపక్ష హోదా కావాలి.. లేదంటే సభకు రాను అని చెప్పడం నేను ఎప్పుడూ చూడలేదు. ఒక వ్యక్తి ఆలోచనా విధానం, డిక్టేట్ చేయడం, శాసించడం ప్రజాస్వామ్యంలో ఉండకూడదు. ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించుకోవాలి. ప్రజలు చైతన్యంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇది ప్రజా ప్రభుత్వం.. జవాబు దారీ ప్రభుత్వం. తొలి రోజు నుండి సంక్షేమం, అబివృద్ధి, సుపరిపాలనను సాగిస్తున్నాం. 150 రోజల్లో అనేక పాలసీలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. 2019-24 వరకు ఒక్క రోజు కూడా సభ సజావుగా సాగలేదు. విధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్లీ నిలబెట్టడానికి మనం బాధ్యతగా నిర్ణయాలు తీసుకోవాలి...దానికి సభ వేదిక కావాలి. పబ్లిక్ పాలసీలు రూకల్పన చేసి అమలు చేస్తే చరిత్ర తిరగరాస్తాం. 2024-29 మధ్య జరిగే ఈ సభ స్వర్ణాంధ్ర ప్రదేశ్ ను సాధించడానికి దోహద పడుతుంది. మిమ్మల్ని(రఘురామకృష్ణరాజును) రాష్ట్రానికి రానివ్వని వారు...మీ ముందు సభలోకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది. ఇదే దేవుడు రాసిన స్ట్రిప్ట్...ప్రజాస్వామ్య గొప్పతనం. భగవంతుడు నాడు చిన్నచూపు చూసి ఉంటే నేడు మిమ్మల్ని ఇక్కడ చూసేవాళ్లం కాదు. ధైర్యంగా నిలబడ్డారు కాబట్టే ఇక్కడిదాకా వచ్చారు. బయపడిన రోజే ఎవరి పని అయినా అయిపోతుంది. ధైర్యంగా నిలబడితేనే విజయం లభిస్తుంది’ అని సీఎం చంద్రబాబు అన్నారు. డిప్యూటీ స్పీకర్ పదవికి రాఘరామ రాజు వన్నె తేవాలని, సభను సమున్నతంగా నడపాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆకాంక్షించారు.