కాకినాడ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి వైద్యారోగ్యశాఖ అధికారులు సీఎంకు నివేదిక అందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రంగరాయ మెడికల్ కాలేజీలో బీఎస్సీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సుల విద్యార్థినుల పట్ల కొందరు సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అంశం వెలుగులోకి వచ్చింది.
ల్యాబ్ అటెండెంట్ కల్యాణ్ చక్రవర్తిపై ఈ నెల 9వ తేదీన విద్యార్థినులు కంప్లయింట్ చేశారు. ఘటనను సీరియస్‌గా తీసుకుని అదే రోజు ఈ అంశంపై కమిటీ నియమించి అధికారులు విచారణ చేపట్టారు. గురువారం రాత్రి వరకు విద్యార్థినులతో మాట్లాడి విచారణ కమిటీ నివేదికను సిద్ధం చేసింది. కాగా చక్రవర్తితో పాటు మరో ముగ్గురు సిబ్బంది కూడా విద్యార్థినులను వేధించినట్లు విచారణలో తేలింది. నివేదిక ఆధారంగా లైంగిక వేధింపులకు పాల్పడిన సిబ్బందిపై చర్యలకు సీఎం ఆదేశించారు.