అమరావతి: ఆడబిడ్డ నిధి పథకం అమలుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలు సభలో మాట్లాడుతూ.. పెన్షన్లు, ఉచిత సిలిండర్ ఇచ్చామని, తల్లికి వందనం, బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తామన్నారు. అప్పటికీ పేదలు ఉంటే.. ఆడబిడ్డ నిధి పథకాన్ని పీ4 కార్యక్రమానికి అనుసంధానం చేసి అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. 18 నుంచి 59 ఏళ్ల మహిళల ఖాతాల్లో ప్రతి నెల రూ.1500 చొప్పున (ఏడాదికి రూ.18,000) జమ చేస్తామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విషయం తెలిసిందే.
నిన్న కర్నూలు జిల్లా, పాణ్యంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. పీ4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చిన మార్గదర్శులను సన్మానించారు. అంతకుముందు పాణ్యం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యకర్తలను నేతలుగా తీర్చిదిద్దడం తెలుగుదేశం పార్టీకే సాధ్యమని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, ప్రగతి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.